వొడాఫోన్ ఐడియా శుభవార్త: జియోకు షాక్‌

12 Oct, 2019 08:59 IST|Sakshi

వొడాఫోన్‌ ఐడియా  కస్టమర్లకు గుడ్‌న్యూస్

ఐయూసీ చార్జీలు వసూలు చేయం 

సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా జియోకు షాకిచ్చింది. ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జ్ (ఐయుసి)ను వసూలు చేస్తున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించిన కొద్ది గంటలకే వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (విఐఎల్) కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చింది. జియో చార్జీల వడ్డనతో కస్టమర్లను ఆగ్రహం తెప్పిస్తే వొడాఫోన్ ఐడియా మాత్రం కస్టమర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. తన వినియోగదారులకు ఇతర నెట్‌ వర్క్‌ కాల్స్ కోసం విడిగా బిల్లింగ్ చేసే ఉద్దేశం తమకు లేదని ప్రకటించింది. ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ చేసే కాల్స్‌ ఏ నెట్ వర్క్‌కు అయినా ఉచితమేనని తెలిపింది. వినియోగదారులపై భారం పడకూడదనేది తమ లక్ష్యమని  వెల్లడించింది.  అంతేకాదు,  ఐయూసీ ఛార్జీలు వసూలు చేస్తామని ప్రకటించడం తొందరపాటు చర్య అని పేర్కొంది. ఇంటర్ కనెక్ట్‌ మధ్య ఇది పరిష్కారం తీసుకురాలేదన్నారు. 

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిర్దేశించిన రెగ్యులేటరీ డెఫినేషన్ ప్రకారం ఐయూసీ ఛార్జీలు మొబైల్ ఆపరేటర్లు తేల్చుకోవాల్సిన విషయాలని, వినియోగదారులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. తమ కస్టమర్లు చేసే ప్రతి కాల్‌కు ఛార్జీలు పడతాయా లేక ఉచిత కాల్స్ చేస్తున్నామా అని అయోమయానికి గురికావాల్సిన అవసరం లేకుండా చేయడమే తమ ఉద్దేశమని తెలిపింది.

వొడాఫోన్ ఐడియా భారతదేశం అంతటా వినియోగదారులకు 2జీ, 3జీ, 4జీ సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పుడు కూడా, భారతదేశంలో 50శాతం కంటే ఎక్కువ మొబైల్ వినియోగదారులు తమ ఫీచర్ ఫోన్లలో 2జీ నెట్‌వర్క్‌నే ఉపయోగిస్తున్నారని  దేశంలోని మారుమూల ప్రాంతాల వినియోగదారులకు సేవ చేయడం లాభదాయకం కానప్పటికీ తాము సేవలందిస్తున్నామని తెలిపింది. తమ కస్టమర్లలో 60శాతం కంటే ఎక్కువ మంది తక్కువ ఖర్చు చేసే బ్రాకెట్‌లో ఉన్నారని, ఈ నేపథ్యంలో ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ కోసం టాప్-అప్ ప్యాక్‌ల అదనపు అవసరాన్ని వారి భరించాలని కోరుకోరని వ్యాఖ్యానించింది.  ప్రస్తుతానికి, వొడాఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారుడు వారి మొబైల్ కనెక్షన్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి రూ.24 రీఛార్జ్ చేయవలసి ఉంటుంది, ఇది 28 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. 

కాగా జియో కానీ నెట్‌వర్క్ కాల్స్‌కు ఐయుసి ఛార్జీల వడ్డను ప్రకటించి వినియోగదారులకు షాకిచ్చింది జియో.ఇక పై ఇతర నెట్‌వర్క్‌ కాల్స్‌కు నిమిషానికి 6పైసలు వసూలు చేస్తామని తెలిపింది. దీనికోసం 10 రూపాయల నుంచి అదనపు టు-అప్ ప్యాక్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు