ఫ్రీ మీల్స్‌ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే?

14 Nov, 2023 19:05 IST|Sakshi

ఆన్‌లైన్‌లో, రెస్టారెంట్‌లోగానీ ఆర్డర్‌ చేసిన ఫుడ్‌లో ఏదైనా లోపం ఉన్నా,  లేదా ఇంకేమైనా వెంట్రుకలు లాంటి అవాంఛిత పదార్థాల్ని, వస్తువులను గుర్తించినా, వెంటనే సంబంధిత డెలివరీ సంస్థకు ఫిర్యాదు చేయడం, దానికి వాళ్లు సారీ చెప్పడం, లేదా ఫ్రీ మీల్‌ ఆఫర్‌ చేయడం ఇదంతా మనకు తెలిసిన కథే. అయితే ఇలాంటి ఫ్రీ మీల్స్‌ కోసం ఆశపడిన ఒక అమ్మడు అడ్డంగా బుక్‌ అయిపోయింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రెస్టారెంట్‌లు కస్టమర్‌లు ఫిర్యాదులు ఆధారంగా వారికి  నష్టపరిహారం ఫ్రీ మీల్స్‌ ఆఫర్‌ చేస్తాయి. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం కథనం ప్రకారం ఇలా ఉచిత భోజనం కక్కుర్తి పడిన బ్రిటీష్ మహిళ రెస్టారెంట్‌ను మోసం చేయాలని ప్లాన్‌ చేసింది. ఇంగ్లాండ్‌లోని బ్లాక్‌బర్న్‌లోని ప్రసిద్ధ తినుబండారం అయిన అబ్జర్వేటరీలో భోజనం  చేస్తూ ఆహారంలో  జుట్టు  వచ్చిందంటూ హడావిడి చేసింది. దీంతో హోటల్‌ యజమాని మహిళ బీఫ్ రోస్ట్ డిన్నర్‌ను తిరిగి ఆఫర్‌ చేశారు. 

అయితే, నిఘా కెమెరాలున్నాయన్న సంగతిని ఆ మహిళ మర్చిపోయింది. కానీ రెస్టారెంట్‌ యజమాని మాత్రం మర్చిపోలేదు. అందుకే  పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చే తమ హోటల్‌లో ఇలా జరిగిందేమిటబ్బా అని  ఆందోళన చెందిన అతను ఆ తరువాత అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించాడు. దీంతో అసలు విషయం తెలిసి ఖంగుతిన్నాడు. వీడియోలో మహిళ జుట్టును  తీసి తన భాగస్వామి సగం తిన్న ప్లేట్‌లో ఉంచడం క్లియర్‌  కనిపించింది.టామ్ క్రాఫ్ట్ దీనిపై  సోషల్‌ మీడియాలోపోస్ట్‌ పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది.  

బిజినెస్‌ బాబులూ బీ అలర్ట్‌ జాగ్రత్త ఇలాంటి వాళ్లూ కూడా ఉంటారు అంటూ ఫేస్‌బుక్‌లో CCTV ఫుటేజీని షేర్ చేశాడు.  ఇది  చాలా అసహ్యంగా అనిపించిందని, కేవలం  15.88 డాలర్లు(రూ. 1300) కోసం ఇంతకు దిగజారతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు తమకు ఫైవ్ స్టార్ ఫుడ్ హైజీన్ రేటింగ్‌ ఉందనీ,  అన్ని ఆహార భద్రతా మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపాడు. నిజంగా సీసీటీవీ ఫుటేజీని గమనించకపోతే ఆమె ఆరోపణతో తన వ్యాపారం, ప్రతిష్ట  గంగలో కలిసిపోయేదిగా అంటూ వాపోయాడు..

మరిన్ని వార్తలు