ఆ కంపెనీలో 30వేల కొలువులు..

27 Jul, 2018 18:21 IST|Sakshi

లక్నో : రిటైల్‌ రంగంలో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే దిగ్గజాలు భారీ స్టోర్‌ల ఏర్పాటుకు పూనుకుంటున్నాయి. యూపీలో 15 స్టోర్‌లను ఏర్పాటు చేయడం ద్వారా స్ధానికులకు 30,000 ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువస్తామని వాల్‌మార్ట్‌ ఇండియా పేర్కొంది. యూపీలో వాల్‌మార్ట్‌ ఇప్పటికే నాలుగు క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్‌లను నిర్వహిస్తుండగా, ఇటీవల లక్నోలో ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌లో 1500 మంది నైపుణ్యంతో కూడిన సిబ్బందికి ఉపాధి కల్పించింది.

యూపీలో జరిగిన ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో భాగంగా రాష్ట్రంలో 15 హోల్‌సేల్‌ క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్స్‌ ఏర్పాటుకు యూపీ సర్కార్‌తో ఒప్పందం చేసుకుంది. ప్రతిస్టోర్‌లో 2000 వరకూ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని,మొత్తం 30 వేల మంది స్ధానికులకు ఉపాధి కలుగుతుందని వాల్‌మార్ట్‌ ఇండియా ప్రతినిధి రజనీష్‌ కుమార్‌ చెప్పారు.

కాగా, లక్నోలో ఆదివారం జరిగే శంకుస్ధాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యానాథ్‌ హాజరవనున్నారు. ఈ కార్యక్రమంలో వాల్‌మార్ట్‌ సహా పలు దిగ్గజ కంపెనీలు తమ యూనిట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నాయని యూపీ పరిశ్రమల మంత్రి సతీష్‌ మహన చెప్పారు.

మరిన్ని వార్తలు