రుణ ఎగవేతదార్లపై... 'సుప్రీం కొరడా '

16 Feb, 2016 23:46 IST|Sakshi
రుణ ఎగవేతదార్లపై... 'సుప్రీం కొరడా '

బ్యాంకుల్లో మొండిబకాయిలు పెరిగిపోవడంపై కన్నెర్ర
రూ.500 కోట్లకు మించి బకాయిపడ్డ డిఫాల్టర్ల జాబితా ఇవ్వాల్సిందిగా ఆర్‌బీఐకి ఆదేశం
♦  పునర్‌వ్యవస్థీకరించిన రుణాల లిస్టు కూడా.. 
♦  సీల్డు కవర్లో సమర్పించేందుకు 6 వారాల గడువు


 న్యూఢిల్లీ: బ్యాంకుల్లో కొండలా పేరుకుపోతున్న మొండిబకాయిల సమస్యపై దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా కన్నెర్రజేసింది. బడా రుణ ఎగవేతదారులపై కొరడా ఝళిపించేందుకు రంగంలోకి దిగింది. రూ. 500 కోట్లకు మించి రుణాలకు సంబంధించి బకాయిలు చెల్లించకుండా డిఫాల్ట్ అయిన కంపెనీల జాబితాను తమముందు ఉంచాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)ను సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. దీంతోపాటు కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణ(సీడీఆర్) స్కీమ్‌లో రుణాలను పునర్‌వ్యవస్థీకరించుకున్న కంపెనీల జాబితాను సైతం ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఆరు వారాల్లోగా వీటిని సీల్డు కవర్లో సమర్పించాలని పేర్కొంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. బెంచ్‌లో జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఆర్ బానుమతి ఉన్నారు. అదేవిధంగా సరైన రికవరీ యంత్రాంగం, తగిన మార్గదర్శకాలు లేకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీ), ఆర్థిక సంస్థలు ఇంత భారీ స్థాయిలో రుణాలను ఎలా ఇచ్చాయో కూడా తెలియజేయాల్సిందిగా ఆర్‌బీఐకి సుప్రీం ధర్మాసనం సూచించింది.

 2005 నాటి ‘పిల్’ ఎఫెక్ట్...
 సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్(సీపీఐఎల్) అనే స్వచ్ఛంద సంస్థ(ఎన్‌జీఓ) 2005లో దాఖలు చేసిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై తాజా విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఆర్‌బీఐని కూడా ఒక ప్రతివాది(పార్టీ) కింద చేర్చింది. ప్రధానంగా కొన్ని కంపెనీలకు ప్రభుత్వ రంగ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(హడ్కో) ఇష్టానుసారంగా అర్హతలేని రుణ గ్రహీతలకు రుణాలిచ్చిందని పేర్కొంటూ ఈ పిల్ దాఖలైంది. కాగా, సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా సీపీఐఎల్ తరఫున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్... ఒక్క 2015 సంవత్సరంలోనే రూ.40,000 కోట్ల విలువైన కార్పొరేట్ రుణాలను బ్యాంకులు మాఫీ చేసినట్లు తెలిపారు.

దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీం ధర్మాసనం... ఈ మొండిబకాయిలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఒక మహమ్మారిలా పట్టిపీడిస్తున్నాయని వ్యాఖ్యానించింది. డిఫాల్టర్ల నుంచి బకాయిల రికవరీకి బ్యాంకులు ఎలాంటి నిర్ధిష్టమైన చర్యలూ తీసుకోలేకపోవడం పట్ల బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది కూడా. ‘వ్యాపార సామ్రాజ్యాలను ఏలుతున్నవారు సైతం రుణాలను తిరిగిచెల్లించకుండా అతిపెద్ద డిఫాల్టర్లుగా మారుతున్నారు. దీనికి సంబంధించిన జాబితా మీ దగ్గర ఉందా’ అంటూ ఆర్‌బీఐ తరఫు లాయర్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ ప్రశ్నించారు. ఈ మొండిబకాయిలకు ప్రధాన కారణం గత యూపీఏ ప్రభుత్వమేనంటూ వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్‌పై కూడా సుప్రీం ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

‘తిరిగి వసూలు కావని తెలిసి కూడా కొంతమందికి బ్యాంకులు రుణాలిస్తాయి. చివరకు వాటిని మొండి బకాయిలుగా ప్రకటిస్తాయి’ అంటూ సుప్రీం ధర్మాసనం మండిపడింది. బ్యాంకుల్లో భారీగా మొండిబకాయిలు ఎగబాకుతుండటం... వాటిని రికవరీ చేసుకునే విషయంలో బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయంటూ ఇటీవలే ఒక జాతీయ పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని సుప్రీం కోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది. 2013-15 మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు రూ.1.14 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేశాయంటూ ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రశాంత్ భూషణ్ ఈ సందర్భంగా సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.

 ఆ అధికారులకు ప్రభుత్వం కొమ్ముకాసింది: భూషణ్
 అనర్హులకు రుణాలివ్వడం వల్లే హడ్కోకు భారీగా మొండిబకాయిలు పేరుకుపోయాయనేది 2005లో దాఖలు చేసిన పిల్‌లో భూషణ్ ప్రధాన ఆరోపణ. అయితే, దీనిపై సుప్రీం కోర్టు కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ)ని దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఆదేశించిందని కూడా ఆయన తాజా విచారణలో పేర్కొన్నారు. కావాలనే రుణాలను ఎగవేసిన(విల్‌ఫుల్ డిఫాల్టర్లు) వారికే హడ్కో రుణాలిచ్చిందన్న విషయాన్ని సీవీసీ తన నివేదికలో తేల్చిందని... అంతేకాకుండా దీనిపై శాఖాపరమైన చర్యలు చేపట్టడంతో పాటు సీబీఐ దర్యాప్తునకు కూడా సిఫార్సు చేసిన విషయాన్ని భూషణ్ ప్రస్తావించారు. అయితే, అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ అవకతవకలతో సంబంధం ఉన్న అధికారులకు కొమ్ముకాయడంతో పాటు ఈ కేసుల నుంచి తప్పించిందని ఆయన ఆరోపించారు.

మరిన్ని వార్తలు