అద్దె కార్లతో పరిశ్రమకు దెబ్బ!

11 Sep, 2015 01:43 IST|Sakshi
అద్దె కార్లతో పరిశ్రమకు దెబ్బ!

కార్లు కొనకుండా.. అద్దెకు తీసుకోవటం పెరుగుతోంది
- టీయూవీ 300 వాహనంతో మార్కెట్లో మళ్లీ జోష్
- రూ.1,500 కోట్ల పెట్టుబడులతో టీయూవీ 300 తయారీ
- ఈ ఏడాది ముగింపులోగా విపణిలోకి మరో 4 వాహనాలు
- మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా

 
చకాన్ (పుణే) నుంచి ఆడేపు శ్రీనాథ్
‘‘ఉబర్, ఓలా, జూమ్‌కార్ వంటి అద్దె కార్ల కంపెనీలతో ఆటో పరిశ్రమ కుదేలవుతోంది. పోటీ పడుతూ కారు అద్దె ధరలను తగ్గిస్తుండటం, కిలోమీటర్లను బట్టి చార్జీలుండటం, నిర్వహణ వంటి సమస్యలూ లేకపోవటంతో అద్దె కార్ల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో లక్షలు వెచ్చించి కారును కొనడం బదులు అవసరాన్ని బట్టి అద్దెకు తీసుకోవటమే ఉత్తమమనే భావన ప్రజల్లో చొచ్చుకుపోయింది’’ ఈ మాటలన్నది ఎవరో కాదు! వాహన తయారీ దిగ్గజమైన మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.

ఇలాంటి పరిస్థితుల నుంచి బయట పడాలంటే... ప్రజల దృష్టిని వాహనాల కొనుగోలు వైపు మళ్లించాలని, అందుకోసం వారి అభిరుచులకు తగ్గ డిజైన్‌ను తీసుకురావాలని చెప్పారాయన. అందుకే తాము ఇటలీకి చెందిన పెనిన్‌ఫెరినా కారు డిజైన్ సంస్థతో కలిసి నాలుగేళ్లు శ్రమించి టీయూవీ (టఫ్ యుటిలిటీ వెహికల్) 300 వాహనాన్ని డిజైన్ చేశామని చెప్పారు. పుణెలోని చకాన్ ప్లాంట్‌లో టీయూవీ 300 వాహనాన్ని విడుదల చేసిన సందర్భంగా గురువారం ఎంఅండ్‌ఎం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పవన్ గోయంకా, ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్) ప్రవీణ్ షాతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు.
 
టీయూవీ 300పై రూ.1,500 కోట్లు: టీయూవీ 300 వాహనం తయారీ, ప్రొడక్ట్ డిజైన్, డ్రైవ్ లైన్, ఏఎంటీల కోసం రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టామని, ఇందులో రూ.1,200 కోట్లు మహీంద్రా సొంత పెట్టుబడులు కాగా... సంస్థకు విడిభాగాలు సరఫరా చేసే సప్లయర్లు మరో రూ.300 కోట్లు పెట్టుబడులు పెట్టారని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ‘‘చెన్నైలోని మహీంద్రా  ఆర్‌అండ్‌డీ సెంటర్‌కు చెందిన 700 మంది ఇంజనీర్లు, పెనిన్‌ఫెరినా డిజైనర్లు కలిసి నాలుగేళ్లు శ్రమించి టీయూవీ 300 వాహనాన్ని డిజైన్ చేశారు.

ఇందుకోసం రూ.200 కోట్లు ఖర ్చయింది’’ అని తెలియజేశారు. మహీంద్రా యూవీ వాహనాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని, టీయూవీ 300 వాహనాలను మన దేశంతో పాటు దక్షిణాఫ్రికాకూ ఎగుమతి చేస్తామని చెప్పారు. ‘‘చకాన్ ప్లాంట్‌కు నెలకు 5 వేల టీయూవీ 300 వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉంది. డిమాండ్‌ను బట్టి దీన్ని విస్తరిస్తాం. రెండేళ్లలో మహీంద్రా నుంచి కొత్తగా మరో 9 వాహనాలు మార్కెట్లోకి వస్తాయి. ఈ ఏడాది ముగిసేలోగా మరో 4 వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తాం’’ అన్నారాయన.
 
ప్రారంభ ధర రూ. 6.90 లక్షలు

మహీంద్రా నుంచి ఏఎంటీ టెక్నాలజీతో తయారు చేసిన తొలి వాహనం ఇదేనని, నీలం, సిల్వర్, తెలుపు, ఎరుపు, నలుపు, ఆరెంజ్, గ్రీన్ రంగుల్లో టీ4, టీ6, టీ8 వేరియంట్స్ అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ‘‘వీటి ప్రారంభ ధరలు రూ.6.90 లక్షల నుంచి 8.40 లక్షల వరకున్నాయి. ప్రస్తుతం డీజిల్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే పెట్రోల్ వర్షన్‌ను కూడా తెస్తాం’’ అన్నారు. టీయూవీ 300 మైలేజ్ 18.49 కిలోమీటర్లు. 5+2 సీటింగ్ సామర్థ్యం ఉంది. దేశంలో యుటిలిటీ వాహనాల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోందని, గతేడాది 38 శాతంగా ఉన్న వృద్ధి రేటు 2014-15 ఆర్థిక సంవత్సరంలో 41 శాతానికి చేరిందని మహీంద్రా తెలియజేశారు. ‘‘దేశంలో నెలకు 55 వేల యూవీ వాహనాలు విక్రయమవుతుంటే.. ఇందులో 5-6 వేల వాహనాలు మా గ్రూప్‌వే. మా విక్రయాల్లో ఎగుమతుల వాటా 8 శాతం. మిగతా 4 వాహనాలు కూడా మార్కెట్లోకి వస్తే 15 శాతానికి చేరుకుంటాం’’ అని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు