రైడర్లతో బహుళ ప్రయోజనాలు

17 Aug, 2014 00:28 IST|Sakshi
రైడర్లతో బహుళ ప్రయోజనాలు

బీమా రంగంలో తరచూ వినిపించే పదాల్లో ‘రైడర్’ ఒకటి. ఉదాహరణకు ఐదు లక్షల రూపాయల ఒక ప్రధాన బీమా పాలసీ మొత్తానికి రూ.2,000 వేలు చెల్లించాలనుకుంటే, అదనంగా మరికొంత అతి స్వల్ప మొత్తం చెల్లించి మరో ఐదు లక్షల బీమా పొందగల సౌలభ్యం ఇందులో ఉంటుంది. అంటే ఒక ప్రాథమిక పాలసీకి అనుబంధంగా స్వల్ప మొత్తం చెల్లింపుల ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందే అవకాశాన్ని రైడర్లు పాలసీదారుకు కల్పిస్తున్నాయి.యాక్సిడెంట్ డెత్ అడిషనల్ కవర్, డిజేబిలిటీ కవర్, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్, హాస్పిటలైజేషన్ కవర్ వంటి పలు అదనపు ప్రయోజనాలను రైడర్ల ద్వారా పొందవచ్చు.
 
ఐచ్ఛికాలు..
మీ లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా రైడర్లు ఏవి తీసుకుంటే ప్రయోజనమన్న విషయాన్ని మీరే నిర్ణయించుకునే వీలు మీకుంటుంది. మీ బేస్ బీమా పాలసీ ప్రయోజనాలకు అదనంగా నాణ్యతాపూర్వక, పరిమాణాత్మకమైన లబ్ధిని చేకూర్చడానికి ఇది దోహదపడుతుంది. పలు కాంబినేషన్లలో రైడర్లు లభ్యమవుతుంటాయి. ఉదాహరణకు అవీవా లైఫ్‌లాంగ్ పాలసీని తీసుకుందాం. ఇందులో బేసిక్ జీవిత బీమా పాలసీకి మూడు రకాల రైడర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదవశాత్తు మరణం, అంగవైకల్యం (ఏడీఅండ్‌డీ), కేన్సర్, గుండెపోటు, అంగ వైఫల్యం వంటి తీవ్ర అస్వస్థత, ప్రమాదం లేదా ఏదైనా వ్యాధి వల్ల మొత్తంగా శాశ్వత అంగవైకల్యం (సీఐఅండ్‌పీటీడీ), ఆసుపత్రి వ్యయాల ప్రయోజనాలు (హెచ్‌సీబీ) వీటిలో ఉన్నాయి.
 
స్వల్ప ప్రీమియంలు...
బేస్ పాలసీ ప్రీమియంలతో పోల్చితే, రైడర్లపై ప్రీమియంలు కూడా అతి స్వల్పంగా ఉంటాయి. ఇక బేసిక్ పాలసీ కాల వ్యవధితో సమానంగా రైడర్లను తీసుకోవాల్సిన పనిలేదు. అంటే వీటిని బేసిక్ పాలసీ ఉన్నన్నాళ్లూ కొనసాగించుకోవాల్సిన అవసరం లేదన్నమాట. మీ బీమా అవసరాలకు, ఎప్పటిక ప్పటి ప్రయోజనాలకు కాలానుగుణంగా రైడర్లు తీసుకోవచ్చు. మరో మాటలో చెప్పాలంటే- బీమా రైడర్ ప్రయోజనాన్ని మొబైల్ ఫోన్ రీచార్జ్‌కి ఎక్స్‌ట్రా టాపప్‌గా పరిగణించవచ్చు. బేసిక్ ప్రయోజనాలకు మరింత అదనపు ప్రయోజనాన్ని ఇక్కడ పాలసీదారుకు రైడర్ అందిస్తుంది.
 
విభిన్న రూపాలు...
బీమా కంపెనీలు రైడర్లను వివిధ రూపాల్లో ఆఫర్ చేస్తున్నాయి. యాక్సిడెంటల్ రైడర్స్, హెల్త్ రైడర్స్, టర్మ్ రైడర్స్, ప్రీమియం రద్దు రైడర్స్, పన్నుల భారాలు తగ్గించుకోవడం... ఇలా వివిధ రూపాల్లో పాలసీదారుకు ఇవి అందుబాటులో ఉంటాయి. వయసు, అవసరాలు, జీవన శైలి, లైఫ్‌స్టైల్ అలవాట్లు, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు... ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణమైన అమిత బీమా ప్రయోజనాలను పొందడానికి రైడర్లు దోహదపడతాయి. రెగ్యులర్ బీమా పాలసీ తీసుకునే ముందు కస్టమర్ ఈ రైడర్లపైనా తప్పనిసరిగా దృష్టి పెట్టాలన్నది ముఖ్య సలహా.

మరిన్ని వార్తలు