మూడేళ్లలో 35,600 కొత్త పెట్రోల్ బంకులు

21 Jan, 2015 03:10 IST|Sakshi
మూడేళ్లలో 35,600 కొత్త పెట్రోల్ బంకులు

న్యూఢిల్లీ: భారత్‌లో మూడేళ్లలో కొత్తగా 35,600 పెట్రోల్ అవుట్‌లెట్‌లు అందుబాటులోకి రానున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను పెంచడంలో భాగంగా పెట్రోలియం అవుట్‌లెట్‌లను ప్రభుత్వం భారీగా ఏర్పాటు చేస్తోంది. వీటిల్లో 27 శాతం అవుట్‌లెట్‌లను బలహీన వర్గాల వారికి, 22.5 శాతం ఎస్‌సీ, ఎస్‌టీలకు కేటాయిస్తామని చమురు మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

బీసీలకు 27 శాతం కేటాయించడం ఇదే మొదటిసారని పేర్కొన్నాయి. ఇప్పటికే 51,870 పెట్రోల్ పంపులున్నాయి. వీటిల్లో ఐఓసీ అవుట్‌లెట్‌లు 23,993, హెచ్‌పీసీఎల్ అవుట్‌లెట్‌లు 12,869, బీపీసీఎల్ అవుట్‌లెట్‌లు 12,123 ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్‌వి 1,400, ఎస్సార్ ఆయిల్‌వి 1,400, షెల్ అవుట్‌లెట్‌లు మూడు చొప్పున ఉన్నాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 13,896 ఎల్‌పీజీ అవుట్‌లెట్‌లను(ఐఓసీ-7,035, బీపీసీఎల్-3,355, హెచ్‌పీసీఎల్-3,506)ను నిర్వహిస్తున్నాయి.

ప్రస్తుతమున్న పెట్రోల్ రిటైల్ అవుట్‌లెట్‌లలో 2,140 అవుట్‌లెట్‌లలో లైటింగ్ కోసం సౌరశక్తిని వినియోగిస్తున్నారు. ఇలా సౌరశక్తి వినియోగిత రిటైల్ అవుట్‌లెట్‌లను 2017, మార్చి 31 నాటికి 7,200కు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో రిటైల్ అవుట్‌లెట్‌ను సౌర విద్యుదీకరణ చేయడానికి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ ఖర్చవుతుందని అంచనా.

మరిన్ని వార్తలు