షావోమి నుంచి ఎయిర్ ప్యూరిఫయర్

22 Sep, 2016 01:38 IST|Sakshi
షావోమి నుంచి ఎయిర్ ప్యూరిఫయర్

ధర రూ.9,999
‘మి బ్యాండ్-2’ కొత్త వెర్షన్ కూడా విడుదల
వచ్చే ఏడాది మార్కెట్‌లోకి స్మార్ట్ రైస్ కుక్కర్!

 న్యూఢిల్లీ: చైనా ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘మి ఎయిర్ ప్యూరిఫయర్-2’ని భారత్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.9,999గా ఉంది. ఇండియాలో హోమ్ కేటగిరి విభాగంలో కంపెనీ విడుదల చేస్తోన్న తొలి ఉత్పత్తి ఇదే. ఇందులో ఇన్‌బిల్ట్ సెన్సార్స్, ఆటో మోడ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. కొత్త ఎయిర్ ప్యూరిఫయర్‌లో ఇన్‌బిల్ట్ వై-ఫై అమర్చామని, అందువల్ల ఈ పరికరం మి హోమ్ యాప్‌తో కనెక్ట్ అవుతుందని కంపెనీ పేర్కొంది.

ఫిల్టర్ల కాలం చెల్లిపోతే ఇది మనకు తెలియజేస్తుందని తెలిపింది. కాగా ఫిల్టర్ల రిప్లేస్‌మెంట్‌కు రూ.2,499 ఖర్చవుతుందని పేర్కొంది. ఈ ఎయిర్ ఫ్యూరిఫయర్లు మి.కామ్‌లో సెప్టెంబర్ 26 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 2 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని వివరించింది. వచ్చే ఏడాదిలో స్మార్ట్ రైస్ కుక్కర్‌ను మార్కెట్‌లోకి తెస్తామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ హుగో బర్రా తెలిపారు. కాగా క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ను త్వరలోనే భారత్ మార్కెట్‌లోకి ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఇక్కడ హార్డ్‌వేర్ స్టార్టప్స్ తయారు చేసిన ప్రొడక్ట్‌లను కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. తద్వారా స్టార్టప్స్ నిధుల సమీకరణకు షావోమి తనవంతు సహకారమందిస్తుంది.

 ‘మి బ్యాండ్-2’ కొత్త వెర్షన్ విడుదల
షావోమి ఎయిర్ ప్యూరిఫయర్‌తోపాటు ‘మి బ్యాండ్-2’ కొత్త వెర్షన్ మార్కెట్‌లోకి తెచ్చింది. దీని ధర రూ.1,999గా ఉంది. ఇందులో ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 20 రోజుల బ్యాటరీ లైఫ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ‘మి బ్యాండ్-2’ అనేది ఫిట్‌నెస్, స్లీప్, హార్ట్ రేట్ ట్రాకర్ పరికరం. దీని సాయంతో ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. పలు యాప్ అలర్ట్స్‌ను పొందొచ్చు. ఇది మి.కామ్‌లో సెప్టెంబర్ 27 నుంచి, అమెజాన్‌లో సెప్టెంబర్ 30 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

మరిన్ని వార్తలు