ఎర్రబస్సు... ఎయిర్‌బస్సు కూడా!

30 May, 2015 01:05 IST|Sakshi
యాత్రాజీనీ సీఈఓ రెనిల్ కోమిట్ల

సెప్టెంబర్ నుంచి యాత్రాజీనీ విమాన టికెట్లు
* నెల రోజుల్లో హోటల్ గదుల బుకింగ్ సేవలు కూడా
* ఆ తర్వాత లాజిస్టిక్స్ విభాగంలోకి..
* 150 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అమెరికా సంస్థ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘ఎర్రబస్సు నుంచి ఎయిర్‌బస్ వరకూ..’ ఇదేదో ప్రాస కోసం వాడింది కాదు. బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ అక్షరాలా దీన్ని నిజం చేస్తోంది.

2013 నవంబర్‌లో బస్సు టికెట్ల బుకింగ్ సేవలను ప్రారంభించిన యాత్రాజీనీ డాట్‌కామ్... ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విమాన టికెట్ల విక్రయం కూడా ప్రారంభిస్తోంది. ‘‘ఇప్పటికే ఎయిర్‌కోస్టా, ఎయిర్ ఇండియా, జెట్ విమాన సంస్థలతో సంప్రతింపులు జరిపాం. మిగతా అన్ని సంస్థలతో చర్చలు జరిపి... అన్ని విమానయాన టికెట్లను యాత్రాజినీలో బుక్ చేసుకునేలా టెక్నాలజీని రూపొందిస్తున్నాం’’ అని యాత్రాజీనీ సీఈఓ రెనిల్ కోమిట్ల చెప్పారు. ‘సాక్షి స్టార్టప్’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలివీ...
 
బెంగళూరు కేంద్రంగా ఏర్పడిన పాక్స్‌టెర్రా సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్... ఈ-కామర్స్ సంస్థలకు సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేసి ఇచ్చేది. ట్రావెల్స్ రంగంలో ఉన్న డిమాండ్‌ను గుర్తించిన ఆ సంస్థ చైర్మన్, సీఈఓ రెనిల్ కోమిట్ల.. యాత్రాజీనీ.కామ్(డ్చ్టట్చజ్ఛజ్ఛీ) పేరుతో బస్ టికెట్, క్యాబ్ బుకింగ్ సేవలను ప్రారంభించారు. ‘‘టికెట్లను విక్రయించడం ఒక్కటే మా పనికాదు. కస్టమర్ ఇంట్లోంచి బయటికి కాలు పెట్టింది మొదలు తిరిగి ఇంట్లోకి వెళ్లే వరకు అవసరమయ్యే అన్ని సేవలూ అందించడమే లక్ష్యంగా సంస్థను ప్రారంభించాం. అంటే కస్టమర్ ప్రయాణం చేసేందుకు అవసరమైన బస్సు టికెట్టు, బస చేసేందుకు బడ్జెట్ హోటల్, చేరుకున్న నగరంలో తిరిగేందుకు క్యాబ్.. ఇలా అన్ని రకాల సేవల్నీ అందించటమే యాత్రాజీనీ నినాదం’’ అంటారు రెనిల్.
 
నెల రోజుల్లో హోటల్స్ బుకింగ్స్..
నెల రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటకరాష్ట్రాల్లో హోటల్ గదుల బుకింగ్ సేవల్ని యాత్రాజీనీ ప్రారంభిస్తోంది. ఇప్పటివరకు 2,000 హోటళ్లు రిజిస్టరు కాగా... దీన్లో తెలుగు రాష్ట్రాల వాటా 10 నుంచి 12 శాతం. ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి 20 హోటల్స్ వరకూ ఉన్నాయి. ఈ ఏడాది ముగింపు నాటికి లాజిస్టిక్ విభాగంలోకి కూడా కంపెనీ అడుగిడబోతోంది. విజయవాడ, విశాఖపట్నం ప్రధాన కేంద్రాలుగా సేవలందించడానికి పెద్ద మొత్తంలో ట్రక్కుల్ని కొనుగోలు చేస్తోంది సంస్థ. యాత్రాజీనీకి చెందిన క్యాబ్ డ్రైవరే లాజిస్టిక్ కేంద్రాల్లోని ఉత్పత్తులను ట్రక్కుల్లో లోడ్ చేసుకొని.. చెప్పిన చిరునామాలో అన్‌లోడ్ చేస్తాడు.
 
తెలంగాణలో క్యాబ్స్ సేవలు..
‘‘ఇటీవలే ఏపీలోని 13 జిల్లాల్లో క్యాబ్స్ సేవలు ప్రారంభించాం. నెల రోజుల్లో తెలంగాణలోని పది జిల్లాల్లో కూడా క్యాబ్స్ ప్రారంభిస్తాం. దశలవారీగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తాం. ఈ ఏడాది ముగింపు నాటికి అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సెప్టెంబర్ నుంచి కర్ణాటకలో 30 జిల్లాల్లో సేవలు ఆరంభిస్తాం. తర్వాత తమిళనాడు, కేరళ మార్కెట్లలోకి వెళతాం. 2016-17 ముగింపు నాటికి ముంబై, ఢిల్లీ నగరాలకూ.. మొత్తం మీద మూడేళ్లలో దేశంలోని వంద నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నా అత్యధిక మార్కెట్ వాటా ఉన్నది మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచే. బెంగళూరు నుంచి ఏపీకి క్యాబ్స్, బస్ టికెట్ల బుకింగ్ డిమాండ్ బాగా ఉంది.

అందుకే ఏపీలో క్యాబ్స్ సర్వీసులను ప్రారంభించిన మూడు నెలల్లో 30,000 బుకింగ్స్ జరిగాయి. ప్రస్తుతం యాత్రాజినీలో లక్ష నుంచి లక్షాపాతిక వేల మంది కస్టమర్లున్నారు. రోజుకు 3,000-3,500 బస్ టికెట్లు, 1,000-1,500 వరకు క్యాబ్స్ బుక్ అవుతున్నాయి. ఇందులో 90 శాతం బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతున్నవే. మిగతావి కర్ణాటక నుంచి. యాత్రాజినీకి క్యాబ్‌లు అద్దెకివ్వాలనుకుంటే.. 15:85 ఓనర్ మేనేజ్‌మెంట్ రూపంలో తీసుకుంటున్నాం’’ అని రెనిల్ వివరించారు.
 
రూ.150 కోట్ల పెట్టుబడులు..
యాత్రాజీనీపై రెండేళ్లలో రూ.30 కోట్ల పెట్టుబడులు పెట్టగా గతేడాది రూ.60 కోట్ల టర్నోవర్ నమోదయింది. ఈ ఏడాది రూ.150 కోట్ల టర్నోవర్‌ను సంస్థ ఆశిస్తోంది. అమెరికాకు చెందిన ఓ వెంచర్  కేపిటలిస్ట్ రూ.150 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సంప్రతింపులు జరుపుతున్నట్లు రెనిల్ వెల్లడించారు. ఈ డీల్‌కు సంబంధించి పూర్తి వివరాలను నెల రోజుల్లో వెల్లడిస్తామన్నారు. యాత్రాజీనీ క్యాబ్స్ జీపీఎస్ టెక్నాలజీతో పనిచేస్తాయని, కస్టమర్లు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వెంటనే నొక్కటానికి ప్యానిక్ బటన్ ఉంటుందని ఆయన తెలియజేశారు.
 
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...
 

మరిన్ని వార్తలు