యస్‌ బ్యాంక్‌ మాజీ బాస్‌ బోనస్‌ వెనక్కి 

18 May, 2019 00:03 IST|Sakshi

ఆర్‌బీఐ ఆదేశాలతో అసాధారణ నిర్ణయం 

రాణా కపూర్‌కి చెల్లించిన 1.44 కోట్ల బోనస్‌ ఉపసంహరణ 

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాలు, మొండిబాకీల సమస్యలతో సతమతమవుతున్న ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ తాజాగా అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు మాజీ ఎండీ రాణా కపూర్‌కు చెల్లించిన రూ. 1.44 కోట్ల బోనస్‌లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. బోనస్‌ కింద 2014–15లో రూ. 62.17 లక్షలు, 2015–16లో చెల్లించిన రూ. 82.45 లక్షల మొత్తాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాల మేరకు వెనక్కి తీసుకోవాలని బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది. 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాలకు గాను కపూర్‌కు బోనస్‌లేమీ చెల్లించలేదని పేర్కొంది. 2004లో ప్రారంభమైన యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుల్లో కపూర్‌ కూడా ఒకరు. ఆయనకు ఇప్పటికీ బ్యాంకులో 4.32 శాతం వాటా కూడా ఉంది. నిబంధనల అమలుపరమైన వివాదాల కారణంగా కపూర్‌ పదవీకాలాన్ని పొడిగించేందుకు ఆర్‌బీఐ నిరాకరించడంతో ఆయన వైదొలగాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో రూ. 6 కోట్ల వార్షిక ప్యాకేజీతో రవ్‌నీత్‌ గిల్‌ నియమితులయ్యారు.  

ముందు జాగ్రత్త చర్య.. 
మరోవైపు, బ్యాంకు బోర్డులో రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ డిప్యుటీ గవర్నర్‌ ఆర్‌ గాంధీని అదనపు డైరెక్టరుగా ఆర్‌బీఐ నియమించడం ముందుజాగ్రత్త చర్యగా అనలిస్టులు అభిప్రాయపడ్డారు. గతంలో ధన్‌లక్ష్మి బ్యాŠంక్, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ)ల్లో కూడా ఆర్‌బీఐ అదనపు డైరెక్టర్లను నియమించిన సంగతి గుర్తు చేశారు. ఈ రెండింటి పరిస్థితి దారుణంగా ఉండేదని, వీటితో పోలిస్తే చాలా పెద్ద సంస్థ అయిన యస్‌ బ్యాంక్‌ విఫలమైన పక్షంలో మరిన్ని ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగానే ఆర్‌బీఐ వ్యవహరించి ఉంటుందని     మెక్వారీ రీసెర్చ్‌ సంస్థ అభిప్రాయపడింది. అటు గాంధీ నియామకం సానుకూల, నిర్మాణాత్మక చర్య గా యస్‌ బ్యాంక్‌ అభివర్ణించింది. పటిష్టమైన యస్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ పూర్తి స్థాయిలో తోడ్పాడు అందిస్తోందని పేర్కొంది. గాంధీ నియామకం వల్ల కార్యకలాపాలకేమీ ఆటంకాలు ఉండబోవని తెలిపింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా