కొత్త కార్డులపై ఆశలు ఆవిరి

2 Feb, 2018 07:38 IST|Sakshi

స్లి్పట్‌ కార్డులకు ప్రభుత్వం మొండిచేయి

కుటుంబం నుంచి వేరు పడిన 49 వేల దరఖాస్తుల తిరస్కరణ

సాధికార సర్వేలో వేరు కాపురంగా నమోదు చేసుకోవాలంటూ మెలిక

చిత్తూరు కలెక్టరేట్‌: ఏరు దాటేవరకు మల్లన్న..ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు కొత్త రేషన్‌ కార్డుల మంజూరులో ప్రభుత్వ తీరు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. జన్మభూమి కార్యక్రమాలు జరిగేంత వరకు ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్‌ కార్డు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం, జన్మభూమి అనంతరం కొత్త కార్డులకు మొండి చేయి చూపుతోంది. జిల్లాలో రేషన్‌కార్డు లేనివారికి కొత్త కార్డులను అందించడం కలగా మారింది. జన్మభూమిలో స్లి్పట్‌ కార్డుల కింద కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆఖరు కు మొండిచేయి చూపుతోంది. సాధికార సర్వేలో వేరుకాపురం ఉన్నట్లు నమోదు చేసుకోవాలని, లేదంటే గతంలోని కార్డుల్లోనే కొనసాగాలంటూ అధికారులు సూచిస్తున్నారు. సాధికార సర్వేలో నమోదుకు వెళితే ఆ విధానం చేపట్టడం కుదరదని సంబంధిత అధికారులు తేల్చి చెబుతుండడంతో కొత్త కార్డులపై ఆశలు వదులుకోవాల్సి వస్తోంది.

జిల్లాలో ఈ ఏడాది జనవరికి 10,91,262 కుటుంబాలకు రేషన్‌ కార్డులు ఉండగా, ఐదో విడత జన్మభూమి సమయానికి మరో 16,649 కొత్త రేషన్‌ కార్డులను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో ప్రజలు ప్రతి గ్రామ సభలో రేషన్‌ కార్డులు మంజూరు కాలేదంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో పాటు  అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీశారు.  ముఖ్యంగా కొత్తగా వివా హం చేసుకుని కుటుంబం నుంచి విడిపోయి వేరుకాపురం పెట్టుకున్న వారికి కొత్త కార్డులు ఇవ్వడంలో ప్రభుత్వం మొండిచేయి చూపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తప్పని తిప్పలు
కొత్త రేషన్‌ కార్డులు పొందాలనుకునే వారికి తిప్పలు తప్పడం లేదు. జన్మభూమి గ్రామ సభలో మాత్రం అధికారులు స్లి్పట్‌ కార్డుల కింద జనవరి 25 నుంచి మీ–సేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్‌కార్డులు పొందే విధంగా వెసులు బాటు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. జన్మభూమి ముగిశాక ప్రభుత్వం స్లి్పట్‌ కార్డులపై ఆశలను గల్లంతు చేస్తోంది. దీనిపై దరఖాస్తుదారులు అధికారులను ప్రశ్నిస్తే,   ఒకసారి సాధికార సర్వే వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాదని, నమోదు కుదరదని, మరోసారి వేరు కాపురం ఉన్నట్లు నమోదు చేసుకోవాలని చెప్పడం గమనార్హం. దీంతో తిరిగి పాత కార్డుల్లోనే వారి పేర్లను కొనసాగించుకునేందుకు కూడా మరో మారు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది.

ప్రభుత్వం పక్కా మోసం
కుటుంబాల నుంచి వివాహనంతరం వేరుపడి కొత్త కాపురాలు పెట్టుకున్న, ఉమ్మడి కుటుంబం నుంచి వేరు పడిన వారికి స్లి్పట్‌ కార్డులు మంజూరు చేయడంలో ప్రభుత్వం మొండిచేయి చూపింది. ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులు మంజురు చేస్తే వచ్చే నష్టమేమి లేదు. అయితే ఈ కొత్త కార్డుల ద్వారా పక్కా గృహాలు, వివిధ పథకాల ఫలాలను పెంచాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జిల్లాలో మొత్తం 49,832 స్లి్పట్‌ కార్డులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. కొత్త కార్డులు కావాల్సిన వారు విడిగా కాపురం ఉన్నట్లు సాధికార సర్వేలో నమోదు చేసుకుని ఉండాలని మెలిక పెడుతోంది. ఇది పక్కా మోసం చేయడమేనని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు