ఛత్తీస్‌లో ముగ్గురు మావోల ఎన్‌కౌంటర్‌

4 Oct, 2018 01:51 IST|Sakshi
మృతి చెందిన మావోయిస్టులు

పర్ణశాల/చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుక్మా ఎస్పీ అభిషేక్‌మీనా కథనం ప్రకారం.. మావోలు సంచరిస్తున్నారనే సమాచారంతో ఫుల్‌బగ్‌డీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన డీఆర్‌జీ బలగాలు మల్కగూడ– ముల్లూరు అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. మావోలు, పోలీసులు ఒకరికొకరు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య గంటసేపు కాల్పులు జరిగాయి. ఘటనాస్థలం నుంచి ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు, నాలుగు తుపాకులు, పైప్‌ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన మావోలను ముల్లేర్‌కు చెందిన మడివి హిడ్మా, కర్తాటి మల్లా, హర్ది హరియాలుగా గుర్తించారు. పట్టుబడిన మావోయిస్టును రవ్వా భీమాగా గుర్తించారు.  

విద్యార్థి కిడ్నాప్‌?: సుక్మా జిల్లాలో మంగళవారం మావోయిస్టులు కళాశాల విద్యార్థిని అపహరించినట్లు తెలిసింది. కుంట సబ్‌ డివిజన్‌ పరిధిలోని ముర్లిగూడకు చెందిన పొడియం ముకేష్‌ స్థానిక ఆశ్రమ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. కుంటకు సమీపంలోని భెజ్జిలో ఉన్న బంధువుల ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలోని అటవీ ప్రాంతంలో కిడ్నాప్‌ చేసినట్టు సమాచారం.
 

మరిన్ని వార్తలు