శ్రీనివాస్‌ హత్య కేసులో నిందితుల గుర్తింపు

25 Jan, 2018 12:23 IST|Sakshi
బొడ్డుపల్లి శ్రీనివాస్‌, ఆయన భార్య లక్ష్మి

సాక్షి, నల్గొండ : నల్గొండలో సంచలనం కలిగించిన కాంగ్రెస్‌ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకేసులో పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీనివాస్‌ హత్యలో ఏడుగురు పాల్గొన్నట్లు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. వారిలో లొంగిపోయిన నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. హత్య అనంతరం లొంగిపోయిన వారిలో కత్తల చక్రి, దుర్గయ్య, మాతంగి, మోహన్‌, గోపి ఉన్నారు. మరో ముగ్గురు రాంబాబు, మల్లేష్‌, శరత్‌లు పరారీలో ఉన్నారు.

వారివల్లే భర్తను కోల్పోయా
శ్రీనివాస్‌ భార్య, నల్గొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మిని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జాయింట్‌ కలెక్టర్‌ నారాయణ రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మి పోలీసుల తీరుపై మండిపడ్డారు. రాత్రి ఫోన్‌ రాగానే శ్రీనివాస్‌ బయటకు వెళ్లారని, కాసేపటికే హత్య జరిగిందన్న విషయం తెలిసిందన్నారు. శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గన్‌ లైసెన్స్‌ ఇవ్వమని అడిగినా పోలీసులు స్పందించలేదని అన్నారు. తమ అభ్యర్థనలను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే భర్తను పోగొట్టుకున్నానని లక్ష్మి రోదించారు.

మరిన్ని వార్తలు