ఆధార్‌కు ఫోన్ నెంబర్‌ లింక్.. అడ్డంగా దొరికాడు!

1 Mar, 2018 09:05 IST|Sakshi
నిందితుడు సతీశ్ మహిపాల్ వాల్మీకి

గత ఆరేళ్లుగా పరారీలో నిందితుడు

ఆధార్ సాయంతో కేసు ఛేదించిన పోలీసులు

సాక్షి, ముంబై: భార్యను కిరాతకంగా హత్యచేసి.. ఆపై పోలీసుల కళ్లుగప్పి వారి నుంచి తప్పించుకున్న ఓ నిందితుడిని అతడి ఆధార్ కార్డ్ సాయంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆధార్‌ను బ్యాంక్ అకౌంట్లు, సిమ్ కార్డులు ఇలా పలు రంగాల్లో అనుసంధాన ప్రక్రియ జరుగుతుండగా.. వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లుతుందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం నేరగాళ్లను అదుపులోకి తీసుకునేందుకు ఓ మార్గమని చెబుతున్నారు.

ముంబై పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన సతీశ్ మహిపాల్ వాల్మీకి(37) నైగమ్‌లో నివాసం ఉంటున్నాడు. 2012లో తన భార్యను అతి దారుణంగా హత్యచేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి పారేశాడు. కేసు నమోదు చేసిన భద్రకాళి స్టేషన్ పోలీసులు సతీశ్ వాల్మీకిని అదుపులోకి తీసుకుని విచారించగా భార్యను తానే హత్యచేసినట్లు అంగీకరించాడు. నిందితుడికి కోర్టు జీవితఖైదు విధించింది. సతీశ్ వాల్మీకిని అదే ఏడాది సెప్టెంబర్‌లో వైద్యపరీక్షల నిమిత్తం నాసిక్ సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా పోలీసుల వాహనం దిగి 60 అడుగుల ఎత్తు నుంచి గోదావరి నదిలో దూకి తప్పించుకున్నాడు.

వాల్మీకి కేసును బోయివాడ స్టేషన్ పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లకు పంపించారు. నిందితుడి ఆధార్ కార్డ్ లభ్యమవడంతో ఫోన్ నెంబర్‌ను పోలీసులు గుర్తించారు. ఫోన్ నెంబర్‌ను ట్రేస్ చేసిన పోలీసులు సోమవారం యూపీలోని నిందితుడి స్వగ్రామం బరానాకు చేరుకున్నారు. వాల్మీకిని అదుపులోకి తీసుకుంటుండగా స్థానికులు పోలీసులపై దాడికి దిగారు. అతికష్టమ్మీద నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం ముంబైకి తీసుకొచ్చారు. సాయంత్రం నాసిక్ సెంట్రల్ రోడ్డు జైలుకు వాల్మీకిని తరలించారు. ఆధార్‌కు ఫోన్ నెంబర్ లింక్ చేయడంతో కేసు సులువుగా ఛేదించగలిగామని పోలీసులు వివరించారు.

మరిన్ని వార్తలు