ఏసీబీ వలలో అవినీతి చేప

27 Apr, 2018 06:59 IST|Sakshi
ఏసీబీకి దొరికిన మాచర్ల మున్సిపల్‌ ఆర్‌ఐ నాగభూషణ ప్రసాద్‌ (టోపీ ఉన్న వ్యక్తి)

మాచర్ల మునిసిపల్‌కార్యాలయంలో ఏసీబీ దాడి

లంచం తీసుకుంటూ చిక్కిన ఆర్‌ఐ నాగభూషణ ప్రసాద్‌

మాచర్ల: ఏసీబీ అధికారుల వలకు అవినీతి చేప చిక్కింది. మాచర్ల మున్సిపాలిటీలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నాగభూషణ ప్రసాద్‌ రూ.18 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. పట్టణంలోని సొసైటీ కాలనీకి చెందిన కె.వేణుగోపాల్‌ ఇంటికి రూ.800 పన్ను వస్తోంది. అయితే అంతకన్నా ఎక్కువ పన్ను పడుతుందని, తనకు రూ.20 వేలు ఇస్తే సరిచేస్తానని వేణుగోపాల్‌కు ఆర్‌ఐ నాగభూషణ ప్రసాద్‌ సూచించారు. తాను ఇంటిపన్ను రూ.800  చెల్లిస్తున్నానని, రూ.20 వేలు ఎందుకు ఇవ్వాలని వేణుగోపాల్‌ అడిగినా ఆర్‌ఐ పట్టించుకోకుండా వేధింపులకు గురిచేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆర్‌ఐ నాగభూషణ ప్రసాద్‌ను పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు గురువారం మాచర్లకు చేరుకున్నారు. బాధితుడికి తొమ్మిది రూ.2వేల నోట్లకు రసాయనాలు పూసి ఆర్‌ఐ వద్దకు పంపించారు. బాధితుడి నుంచి ఆర్‌ఐ రూ.18 వేల నగదు తీసుకోగానే ఏసీబీ డీఎస్పీ దేవానంద్, సీఐలు వెంకటేశ్వర్లు, ఫిరోజ్‌ దాడిచేసి నగదు స్వాధీనంచేసుకుని, ఆర్‌ఐ చేతులను పరీక్షించి లంచం తీసుకున్నట్లు నిర్ధారించి అరెస్టు చేశారు. ఆర్‌ఐతోపాటు పురపాలక సంఘ అధికారులను విచారణ చేశారు.

గతంలోనూ ఏసీబీ దాడులు
గత ఏడాది పట్టణ పోలీసు స్టేషన్‌లో అప్పటి ఎస్‌ఐ నారాయణరెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. అంతకు ముందు వీఆర్‌ఓ ప్రసాద్, దుర్గి వీఆర్‌ఓ కూడా మాచర్లలో ఏసీబీ అధికారులకు దొరికారు. తాతాజా మున్సిపల్‌ ఆర్‌ఐ ఏసీబీకి చిక్కడంతో పట్టణంలో చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు