టీడీపీ నాయకుడి ఇంట్లో నకిలీ మద్యం తయారీ

30 Dec, 2019 12:36 IST|Sakshi
నకిలీ మద్యం బాటిళ్లు ,రాంబాబు (ఫైల్‌)

అండర్‌ గ్రౌండ్‌లో ఆరేళ్లుగా వ్యాపారం

భారీగా ముడి సరుకు స్వాధీనం

పరారీలో నిందితుడు.. దందాలో టీడీపీ నేతల హస్తం

కర్నూలు డోన్‌ టౌన్‌: నకిలీ మద్యం తయారీ గుట్టును ఎక్సైజ్‌ జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు రట్టు చేశారు. ఆదివారం డోన్‌ మండలం ఉడుములపాడు గ్రామంలో టీడీపీ నాయకుడు ఉప్పరి రాంబాబు ఇంటిపై దాడి చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భారీ మొత్తంలో నకిలీ మద్యంతోపాటు తయారీకి ఉపయోగించేముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారీలో రాంబాబుతో పాటు జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ప్రజాప్రతినిధి, డోన్‌ మండల మాజీ ఎంపీపీ, కొత్తకోట గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకుల హస్తం ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో రాంబాబు..టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్ట్‌ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. గత ఆరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారీని కొనసాగిస్తూ లక్షలాది రూపాయలను అక్రమంగా ఆర్జించినట్లు ఈయనపై ఆరోపణలున్నాయి. ఇక్కడ తయారీ చేసిన నకిలీ మద్యాన్ని జిల్లా అంతటా తరలించేవాడు.

అండర్‌గ్రౌండ్‌ కేంద్రంగా..
ఉడుములపాడులో రాంబాబు నిర్మించిన ఇంటిలోని అండర్‌ గ్రౌండ్‌లో నకిలీ మద్యం తయారు చేసేవారు. ఆఫీసర్‌ చాయిస్, ఇంపీరియల్‌ బ్లూ, మ్యాక్‌డోల్‌ విస్కీ..తదితర బ్రాండ్ల పేరుతో స్పిరిట్, క్యారామిల్‌ పౌడర్, కెమికల్‌ ఫ్లేవర్‌ కలిపి మద్యం తయారు చేవారు. ఖాళీ బాటిళ్లు, లేబుల్స్, మూతలు, స్పిరిట్‌తో నిండి ఉన్న క్యాన్లను ఎక్సైజ్‌ పోలీసులు స్వాదీనం చేసుకొన్నారు. 

అన్నీ బ్రాండ్లు ఇక్కడే  

ఈ నెల 7,10వ తేదీల్లో కృష్ణగిరి మండలానికి చెందిన జయపాల్‌ రెడ్డి, బ్రహ్మానందరెడ్డిలను అరెస్టుచేసి నకిలీ ఇంపీరియల్‌ బ్లూ మద్యాన్ని ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కర్నూలు కృష్ణానగర్‌లో నకిలీ మద్యం తయారీతో సంబందం ఉన్న హాలహార్వి వీఆర్వో విష్ణువర్దన్‌ రెడ్డి, కృష్ణమూర్తి, భాస్కర్‌లను అరెస్టు చేశారు. నకిలీ మద్యం తయారు చేసే కర్ణాటక రాష్ట్రం దర్వాడ్‌ జిల్లా హాల్వాహో గ్రామానికి చెందిన వినోద్‌ కలార్‌పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నకిలీ మద్యం తయారీపై పూర్తి సమాచారం సేకరించిన ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు..ఆదివారం ఉడుములపాడు గ్రామంలోని రాంబాబు ఇంటిపై మెరుపుదాడి నిర్వహించారు. తీగెలాగితే డొంక కదిలినట్లు నకిలీ మద్యం తయారీదారులు ఒక్కొక్కరుగా పట్టుబడుతున్నారు. అయితే చాలా ఏళ్ల నుంచి ఈ దందా కొనసాగిస్తున్న అసలు నిందితులను వెలుగులోకి రావాల్సి ఉంది.

పూర్తి వివరాలు వెల్లడించలేం  
 నకిలీ మద్యం తయారీ కేంద్రంలో పట్టుబడిన వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడే చెప్పలేమని ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడ లభించిన నకిలీ మధ్యం బాటిళ్లు, ముడి సరుకు వివరాలను తెలపాలంటే కాస్త సమయం పడుతుందని అధికారులంటున్నారు. తదుపరి విచారణ జరిపి.. అసలు నిందితులను అదుపులోకి తీసుకునే వరకు ఈ విషయాన్ని చెప్పలేమని వారు వివరిస్తున్నారు. దాడుల్లో ఎక్సైజ్‌ టాస్క్‌పోర్స్‌ సీఐ శిరీషాదేవి, డోన్‌ సీఐ లక్ష్మణదాసు, ఎస్‌ఐ రమణారెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణ, సిబ్బంది సుధాకర్‌రెడ్డి, లాలప్ప, ధనుంజయ, శంకర్‌ నాయక్‌తో పాటు మరికొంతమంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా