రెండు రాష్ట్రాల మధ్య రాజుకున్న భూ వివాదం

30 Dec, 2019 12:37 IST|Sakshi

కర్ణాటక-మహారాష్ట్ర మధ్య బెళగావి వివాదం

సాక్షి, బెంగళూరు : కర్ణాటక, మహారాష్ట్ర మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బెళగావి భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కర్ణాటకలో మరాఠా మాట్లాడుతున్న ప్రజలంతా బెళగావిలో నివశిస్తున్నారు. అయితే ఈ ప్రాంతం తమదంటే తమదేనని రెండు రాష్ట్రాల మధ్య గతకొంత కాలంగా వివాదం సాగుతోంది. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనిపై ఆందోళనలు మరింత ఎక్కువగా మారాయి. దీనికి కారణం లేకపోలేదు. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్‌ ఠాక్రే బాధ్యతలు స్వీకరించిన అనంతరం బెళగావి వివాదంపై ఆయన దృష్టిసారించారు. బెళగావి ముమ్మాటికి తమకే చెందుతుందని, దానిని సాధించి తీరుతామని ఠాక్రే స్పష్టం చేశారు. అనంతరం దీనిపై కమిటీని సైతం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.

అయితే ఠాక్రే వ్యాఖ్యలపై కన్నడనాట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప తీవ్రంగా ఖండించారు. ఠాక్రే ప్రజలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడుతున్నారని, బెళగావి ముమ్మాటికి తమదేనని పేర్కొన్నారు. కన్నడకు చెందిన ఇంచు స్థలం కూడా వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. దీంతో ఆ ప్రాంతం కోసం తీవ్రంగా పోరాడుతున్న మహారాష్ట్ర ఏకీకరణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొల్హాపూర్‌లో యడియూరప్ప దిష్టిబొమ్మను ఆ పార్టీ నేతలు దహనం చేశారు. దీంతో రెండు ప్రాంతాల మధ్య ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి.

తాజాగా మహారాష్ట్ర ఏకీకరణ సమితి నేతలను రాష్ట్ర సరిహద్దుల్లో నిలబెట్టి తుపాకీతో కాల్చి పారేయాలంటూ కర్ణాటక నవనిర్మాణ సేన అధ్యక్షుడు భీమాశంకర్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఆందోళనకారులు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కొల్హాపూర్‌లో కన్నడ సినిమా ప్రదర్శనలను శివసైనికులు అడ్డుకున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా రెండు ప్రాంతాల మధ్య బస్సు సర్వీసులను రద్దు చేశారు.

మరిన్ని వార్తలు