వేర్వేరు చోరీలకు పాల్పడుతున్న ముఠాలు అరెస్టు

25 Feb, 2020 15:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వేర్వేరు కేసుల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాలను అరెస్టు చేసినట్లు సీపీ అంజనీ కుమార్‌ వెల్లడించారు. బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో అంజనీ మాట్లాడారు. ఇళ్లలో ఎవరు లేని సమయాన్ని టార్గెట్‌ చేసుకొని చోరీలకు పాల్పడుతున్న సయ్యద్ యూసుఫ్, షేక్ సాహద్, సయ్యద్ శహ్ బా‌జ్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.10 లక్షల పది వేలు విలువైన ఆభరణాలు, లక్ష రూపాయల విలువ చేసే గడియారం, రెండు బైక్ లు, కొబ్బరి బోండాల కట్ చేసే కత్తి, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు.కాగా ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే వీరు చోరీల బాట పట్టారు.

కాగా మరో కేసులో దుర్గామాతా విగ్రహంతో పాటు కోటి రూపాయల విలువ చేసే నాగమణి రాయిని విక్రయిస్తున్న నలుగురు నిందితులను వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారని అంజనీ కుమార్‌ వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బీ. దేవేందర్, టీ. జాన్, ప్రేమ్ చంద్ గుప్తా, మహమ్మద్ అష్రఫ్ లు ఉన్నారు. దేవేందర్ మూడేళ్ల క్రితం ముంబైలో ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి నాగమణి రాయిని కొనుగోలు చేశాడు.ఈ క్రమంలోనే విగ్రహంతో పాటు నాగమణి రాయిని అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే వీరివద్ద లభించిన దుర్గామాతా విగ్రహం, నాగమణి రాయి పంచలోహం కాదని నకిలీవని తేలినట్లు అంజనీ స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు