జయరామ్‌ హత్య కేసులో కొత్త ట్విస్ట్

15 Feb, 2019 19:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ చిగురుపాటి జయరామ్‌ హత్యకేసులో మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌ రెడ్డి పోలీసుల విచారణలో కొత్త డ్రామా తెర మీదకు తెచ్చాడు. తాను అక్రమాల ద్వారా సంపాదించిన డబ్బు ఖర్చు చేయించడమే కాకుండా, పెళ్లికి నిరాకరించిన జయరామ్‌ మేనకోడలు శిఖా చౌదరిపై కోపంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో తవ్వినకొద్ది కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ హత్యకేసులో రాకేష్‌ రెడ్డితో పాటు డ్రైవర్‌ శ్రీనివాస్‌, విశాల్‌ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.

శిఖా చౌదరి బ్రేకప్‌ చెప్పడంతో..
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం...‘శిఖా చౌదరి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతోపాటు, రాకేష్‌ రెడ్డికి బ్రేకప్‌ చెప్పి దూరం పెట్టడంతో అతడు కోపం పెంచుకున్నాడు. దీంతో శిఖా చౌదరికి ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఆమెపై ఒత్తిడి పెంచాడు. అంతేకాకుండా ఆమెకు జయరామ్‌ బహుమతిగా ఇచ్చిన కారును రాకేష్‌ రెడ్డి తీసుకు వెళ్లాడు. ఈ విషయాన్ని శిఖా చౌదరి తన మేనమామకు చెప్పడంతో ఆ డబ్బులు తాను ఇస్తానని జయరామ్‌ హామీ ఇచ్చి, కారు తిరిగి శిఖాకు ఇప్పించాడు. ఆ తర్వాత జయరామ్‌ను డబ్బులు అడిగితే సరిగా స్పందించకపోవడంతో ఎలాగైనా ఆ డబ్బులు వసూలు చేయడానికి రాకేష్‌ రెడ్డి పథకం వేశాడు. దీంతో జయరామ్ కుటుంబంతో పాటు, ఆయన ఆస్తులపై రెక్కీ నిర్వహించాడు. ఎలాగైనా జయరామ్‌ను బెదిరించి ఆస్తి కొట్టేసి, ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యేందుకు పక్కాగా స్కెచ్‌ వేశాడు. 

హనీ ట్రాప్‌తో పక్కా స్కెచ్‌
ఇందుకోసం జయరామ్ అమెరికా నుంచి రాగానే రాకేశ్‌ రెడ్డి ‘హనీ ట్రాప్‘  చేసి, ఇంటికి వచ్చేలా ప్లాన్‌ చేశాడు. ఇందుకోసం అతడు తన డ్రైవర్‌ శ్రీనివాస్‌, రౌడీ షీటర్‌ నగేష్‌, అతడి మేనల్లుడు విశాల్‌, జూనియర్‌ ఆర్టిస్ట్‌ సూర్యప్రసాద్‌ సాయం తీసుకున్నాడు. జయరామ్‌ను 19 గంటల పాటు తన ఇంట్లో నిర్భందించాడు. ఆ సమయంలో డబ్బులు అడగగా...జయరామ్‌ రూ.6 లక్షలు సమకూర్చాడు. తనను వదిలిపెడితే రూ.10 కోట్లు ఇస్తానని జయరామ్‌ ఆఫర్‌ చేసినా రాకేష్‌ రెడ్డి నిరాకరించాడు. అంతేకాకుండా నిన్ను చంపితే నాకు రూ.100 కోట్లు వస్తాయంటూ... అతడితో ఖాళీ బాండ్‌ పేపర్లపై సంతకాలు చేయించుకుని దారుణంగా హతమార్చాడు. ఈ హత్యకు డ్రైవర్‌ శ్రీనివాస్‌తో పాటు విశాల్‌ కూడా సహరించాడు. ఆ తర్వాత హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని కారులో కృష్ణాజిల్లా నందిగామకు వెళ్లాడు. ఆ తర్వాత కారు అక్కడే వదిలేసి తిరిగి హైదరాబాద్‌ వచ్చేశాడు. 

విశాల్‌ లైఫ్‌ సెటిల్‌ చేస్తానంటూ..
రాకేష్‌ రెడ్డి తాను చేస్తున్న అక్రమ దందాలకు రౌడీ షీటర్ నగేష్‌ సాయం తీసుకునేవాడు. ఆ నేపథ్యంలో అతడి మేనల్లుడు విశాల్‌తో పరిచయం అయింది. నీ లైఫ్‌ సెటిల్‌ చేస్తానంటూ ఆశచూపించిన రాకేష్‌ రెడ్డి... జయరామ్‌ హత్యకు విశాల్ సాయం తీసుకున్నాడు. అంతేకాకుండా హత్య కేసులో నీ పేరు రాకుండా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చాడు. జయరామ్‌ హత్య తర్వాత ఆస్తులను లిటిగేషన్‌ చేస్తామని, అతడి భార్య పద్మశ్రీతో సెటిల్‌మెంట్‌ చేసుకుందామని విశాల్‌ ఆశ చూపించిన రాకేష్‌ చిట్టచివరికి పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. ఆది నుంచి క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్న ఈ ఎపిసోడ్‌లో జయరామ్‌ హత్యకు శిఖా చౌదరి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు