కర్ణాటక లీగ్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌!

8 Nov, 2019 04:40 IST|Sakshi

ఇద్దరు దేశవాళీ క్రికెటర్ల అరెస్ట్‌

నెమ్మదిగా ఆడేందుకు ఒప్పందం

సాక్షి, బెంగళూరు: గత కొంత కాలంగా ఫిక్సింగ్‌కు కేంద్రంగా మారిందని భావిస్తున్న కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌ (కేపీఎల్‌)లో మరో కొత్త వివాదం బయటకు వచ్చింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో ఇద్దరు కర్ణాటక క్రికెటర్లను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరిలో ఒకరు చిదంబరం మురళీధరన్‌ (సీఎం) గౌతమ్‌ కాగా, మరొకరు అబ్రార్‌ కాజీగా వెల్లడైంది. ఈ ఏడాది జరిగిన కేపీఎల్‌ ఫైనల్లోనే వీరిద్దరు స్పాట్‌ ఫిక్సింగ్‌ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. హుబ్లీ టైగర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు బెళ్లారి టస్కర్స్‌కు గౌతమ్‌ కెప్టెన్‌ కాగా... కాజీ సభ్యుడు. చివరకు ఈ మ్యాచ్‌లో టస్కర్స్‌ 8 పరుగులతో ఓడింది. నెమ్మదిగా బ్యాటింగ్‌ చేసేందుకు వీరిద్దరు రూ. 20 లక్షలు తీసుకున్నారు. బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో కూడా గౌతమ్, కాజీ ఫిక్సింగ్‌ పాల్పడినట్లు తేలింది.

గౌతమ్‌ ఘనమైన రికార్డు
ఫిక్సింగ్‌కు పాల్పడి అరెస్టయిన క్రికెటర్లలో సీఎం గౌతమ్‌కు ఆటగాడిగా మంచి గుర్తింపు ఉంది. 33 ఏళ్ల వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ గౌతమ్‌ 11 ఏళ్ల కెరీర్‌లో 94 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. 41.36 సగటుతో అతను 4716 పరుగులు చేశాడు. 9 సీజన్ల పాటు కర్ణాటకకు ఆడిన అతను ఆ జట్టు 2013–15 మధ్య వరుసగా రెండు సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. సుదీర్ఘ కాలం వైస్‌కెప్టెన్‌గా ఉన్న గౌతమ్‌... వినయ్‌ కుమార్‌ గైర్హాజరులో జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

అతను నాయకత్వం వహించిన టీమ్‌లో ఉతప్ప, కేఎల్‌ రాహుల్, మయాంక్, మనీశ్‌ పాండేలాంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇండియా ‘ఎ’ తరఫున కూడా ఆడిన గౌతమ్‌... ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, ముంబై, ఢిల్లీ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది గోవా జట్టుకు మారగా, ఇప్పుడు అతని కాంట్రాక్ట్‌ రద్దయింది. కర్ణాటక తరఫున 17 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన అబ్రార్‌కు గౌతమ్‌తో సాన్నిహిత్యం ఉంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున ఒకే ఒక మ్యాచ్‌ ఆడాడు.

మరిన్ని వార్తలు