ఏటీఎంల దొంగ అరెస్టు

17 Feb, 2019 11:47 IST|Sakshi
అరెస్ట్‌ చేసిన ఏటీఎం దొంగ వివరాలు చెబుతున్న సీఐ పెద్దయ్య

చిత్తూరు, పీలేరు రూరల్‌ : ఏటీఎంల వద్ద అమాయకులను మోసం చేస్తూ వారి ఖాతా ల నుంచి నగదు డ్రా చేసే ఘరానా మోసగాడిని పీలేరు అర్బన్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పీలేరు అర్బన్‌ సీఐ చిన్నపెద్దయ్య కథనం.. మేరకు అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొక్కంటిక్రాస్‌కు చెందిన షేక్‌ షఫీ(39) ఏటీఎంల వద్ద చోరీలు చేయడంలో సిద్ధహస్తుడు. ఏటీఎంల వద్ద నిరక్షరాస్యులు, వృద్ధులకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ వారి పిన్‌ నంబర్లను తెలుసుకుని వారికి తెలియకుండా నగదు డ్రా చేయడం, కుదరకపోతే తన వద్ద ఇతర ఏటీఎం కార్డులను వారికిచ్చి తరువాత డబ్బులు డ్రా చేసేవాడు. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబర్‌ 4న పీలేరుకు చెందిన టెంకాయల వ్యాపారి జి.చంద్రశేఖర్‌ అతని భార్య స్థానిక క్రాస్‌ రోడ్డులోని ఏటీఎం వద్ద నగదు డ్రా చేసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా వారిని గమనించిన షఫీ సాయం చేస్తానంటూ వారి కార్డు తీసుకుని రూ.4వేలు తీసిచ్చాడు.

వారి ఖాతాల్లో మరింత డబ్బు ఉండడం గమనించి అప్పటికే తన వద్దనున్న అదే రకం కార్డు వారికిచ్చి పంపేశాడు. ఆ తర్వాత వారి కార్డుతో షఫీ అదేరోజు రాత్రి తిరుపతిలో రూ.20వేలు విత్‌డ్రా చేశాడు. మరుసటి రోజు తిరుపతిలోని వేర్వేరు బంగారు దుకాణాల్లో కార్డు ఉపయోగించి రూ.29వేలు విలువచేసే ఉంగరం రూ.63వేలు విలువచేసే బ్రాస్‌లెట్‌ కొన్నాడు. తాము మోసపోయామని గ్రహించిన చంద్రశేఖర్‌ దంపతులు పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎం, బంగారు షాపుల్లో సీసీ టీవీల పుటేజీ ఆధారంగా ఈ కేటుగాడిని పోలీసులు గుర్తించారు. పీలేరులోని యాక్సిస్‌ ఏటీఎం వద్ద అమాయకులను బురిడీ కొట్టించే ప్రయత్నంలో ఉన్న అతగాడిని అరెస్ట్‌ చేశారు.

అతని నుంచి ఒక ఏటీఎం కార్డు, 20వేల రూపాయలు, బంగారు ఉంగ రం, బ్రాస్‌లెట్‌ స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు. ఇతడు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాలోని దాదాపు 35 ఏటీఎంలలో   దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసు ల విచారణలో తేలింది. కార్యక్రమంలో ఎస్‌ఐలు సుధాకరరెడ్డి, వినాయకం, పోలీసు సిబ్బంది అల్తాఫ్, నరసింహులు, ఆది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు