చికిత్స పొందుతూ బాలుడి మృతి

3 Sep, 2019 12:46 IST|Sakshi
బాలుడి మృతదేహంతో ఆందోళన చేస్తున్న బంధువులు, బీజేపీ నాయకులు

డాక్టర్‌ నిర్లక్ష్యంతో మృతి చెందాడని బంధువుల ఆరోపణ

ఆస్పత్రి వద్ద ధర్నా చేసిన బంధువులు, బీజేపీ నాయకులు

విచారణ చేపట్టి చర్యలుతీసుకుంటామన్న డీఎస్పీ

మెదక్‌, జహీరాబాద్‌ టౌన్‌: చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందిన ఘటన జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం చోటు చేసుకుంది. డాక్టర్‌ నిర్లక్ష్యంతో సరైన వైద్యం అందక బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.  విషయం తెలుసుకున్న బంధువులు, బీజేపీ నాయకులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. బాలుడికి వైద్యం అందించడంలో డాక్టర్‌ నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు.  కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జహీరాబాద్‌ పట్టణంలోని ఆర్యనగర్‌కు చెందిన విజయ్‌ (ఆటో డ్రైవర్‌) తన 11 నెల బాబు కడుపు నొప్పితో బాధపడుతుంటే ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్‌ హనీఫ్‌ బాలుడికి చికిత్స అందించారు.

చికిత్స అనంతరం బాలుడి పరిస్థితి విషమించి  కొద్ది సేపటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాలుడి  బంధువులు, బీజేపీ నాయకులు ఏరియా ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. డాక్టర్‌ హనీఫ్‌ బాబుకు సరైన వైద్యం అందిచనందున మృతి చెందాడని బంధువులు  ఆరోపించారు.  ఆస్పత్రిలో మతాలు, కులాల పరంగా వైద్యం సేవలు అందిస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్‌ ఉద్ధేశ పూర్వకంగా బాబుకు సరైన చికిత్స అందిచకపోవడంతో చనిపోయాడని బీజేపీ నాయకుడు పూల సంతోష్‌ ఆరోపించారు.  ఆస్పత్రిలో మౌలిక వసతులు కూడా లేవని, సీరియస్‌ పేషంట్‌లకు వైద్యం అందించకుండా హైదరాబాద్‌కు రెఫర్‌ చేస్తున్నారని వాపోయారు.  వైద్యుడి నిర్లక్ష్యంతో మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ గణపతి జాదవ్, జహీరాబాద్‌ టౌన్‌ సీఐ. సైదేశ్వర్, ఎస్‌ఐ. వెంకటేశం ఆస్పత్రిని సందర్శించారు. ఘటనకు సంబంధించి వివరాలను సేకరించారు.

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
ఘటనపై డీఎస్పీ గణపతి జాదవ్‌ మాట్లాడుతూ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందడం బాధకరమైన విషయమన్నారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. బాలుడి తల్లి తండ్రులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు దర్యాప్తు చేస్తామన్నారు. ఇలా ఉండగా  బాలుడికి వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని డాక్టర్‌ హనీఫ్‌ పేర్కొన్నారు. బాలుడు ఆస్పత్రికి వచ్చేసరికి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన సేవలను అందించామన్నారు.

మరిన్ని వార్తలు