ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసిన బాలలహక్కుల సంఘాలు

2 Feb, 2019 13:00 IST|Sakshi

చెన్నై : సినీనటి భానుప్రియ మెడకు బాలకార్మిక చట్టం కేసు చుట్టుకునేట్టు కనిపిస్తోంది. మైనర్ బాలికను పనికి నియమించుకోవడం పట్ల బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. అంతేకాదు, బాలికను లైంగికంగా వేధించారని ఆరోపణలు రావడంతో ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో మూడు రోజుల కిందట భానుప్రియను అరెస్ట్ చేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఫిర్యాదు చేసింది. చదువుకోవాల్సిన బాలికను పనిలో పెట్టుకున్నందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. భానుప్రియపై కేసు నమోదుచేసి, అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. మైనర్‌ బాలలను పనిలో పెట్టుకోవడం నేరం. ఇలా పెట్టుకున్నట్లు రుజువైతే కోర్టు భానుప్రియకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.50 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పండ్రవాడ గ్రామానికి చెందిన ప్రభావతి కుమార్తె సంధ్యను మూడేళ్ల క్రితం భానుప్రియ తన ఇంట్లో పనికి పెట్టుకుంది. ఇటీవల కాలంలో తన కుమార్తెను భానుప్రియ సోదరుడు లైంగికంగా వేధిస్తున్నాడని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం, తమ ఇంట్లో దొంగతనానికి పాల్పడి చోరీ వస్తువులు అడిగినందుకు ఇలా కేసు పెట్టి బెదిరిస్తున్నారని భానుప్రియ ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భానుప్రియ ఇంట్లో పని చేసే బాలిక తాను ఎలాంటి వేధింపులకు గురి కాలేదని, తల్లి చెప్పడంతోనే దొంగతనానికి పాల్పడినట్టు ఒప్పుకుం‍ది. దాంతో దొంగతనం కేసు నుంచి తప్పించుకోవడానికే భానుప్రియ కుటుంబంపై ఈ ఆరోపణలు చేసినట్లు గుర్తించిన పాండీబజార్ పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు