టీటీడీ బస్సు చోరీ కేసు నిందితుడి అరెస్ట్‌

4 Oct, 2023 04:29 IST|Sakshi

ఏఎస్పీ విమలకుమారి

తిరుమల/తిరుపతి లీగల్‌ : టీటీడీ ఉచిత ధర్మరథం ఎలక్ట్రిక్‌ బస్సు చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించినట్లు నేరవిభాగం ఏఎస్పీ విమలకుమారి తెలిపారు. మంగళవారం స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, హయత్‌నగర్‌ మండలం అనంజపూర్‌ గ్రామంలోని నీలావర్‌ గణపతి కుమారుడు నీలావర్‌ విష్ణు (20) గతనెల 24వ తేదీన తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చాడు.

టీటీడీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయం దగ్గర ఉంచిన రూ.1.44 కోట్ల విలువైన టీటీడీ ఉచిత ధర్మరథం ఎలక్ట్రిక్‌ బస్సును చోరీ చేసి తీసుకెళ్లాడు. నిందితుడు అదేరోజు పోలీసులకు భయపడి నాయుడుపేట చెన్నై రహదారిపై బస్సును వదిలి పారిపోయాడు. అతని కోసం పోలీసులు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో గాలించి సోమవారం సాయంత్రం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో అరెస్ట్‌ చేశారు.

కాగా, ఈ కేసులో అరెస్టయిన నిలావర్‌ విష్ణు తల్లిదండ్రులు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వలసి వచ్చి జీవిస్తున్నారు. 2015లో విష్ణు తండ్రి భార్యను హత్యచేసి జైలుకు వెళ్లాడు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీసులకు జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి రివార్డులను ప్రకటించగా.. ఏఎస్పీ వారికి అందజేశారు.ఇదిలా ఉండగా నిందితుడు నీలావర్‌ విష్ణుకు ఈనెల 17వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోటేశ్వరరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు