రాత్రికి రాత్రే రూ.10 లక్షల బస్ షెల్టర్ మిస్సింగ్‌: షాక్‌లో పోలీసులు

5 Oct, 2023 18:49 IST|Sakshi

 కర్నాటకలోని బెంగళూరు నగరంలో మరో బస్‌షెలర్ట్‌‌ మాయం కావడం కలకలం రేపింది. సిలికాన్ సిటీ కన్నింగ్‌హామ్ రోడ్‌లో  నిర్మించిన వారం రోజులకే  రూ. 10 లక్షల విలువైన ఈ షెల్టర్  ఉన్నట్టుండి కనపించకుండా పోయింది. బస్ట్‌ స్టాండ్‌ మాయం ఏంటి అనిఆశ్చర్య పోతున్నారా?  ఇక్కడ  బస్ షెల్టర్ అదృశ్యమవడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి వరుస సంఘటనలు ఇక్కడ నమోదుకావడం గమనార్హం. ముప్పయేళ్ల నాటి HRBR లేఅవుట్‌లోని బస్టాండ్ మార్చిలో  రాత్రికి రాత్రే మాయమైంది. ఇపుడు మరో బస్టాండ్‌.

స్టెయిన్‌లెస్-స్టీల్ స్ట్రక్చర్‌తో, రద్దీగా ఉండే కన్నింగ్‌హామ్ రోడ్‌లో బస్ షెల్టర్ ఆగస్ట్ 21న ఏర్పాటు చేయగా ఆగస్ట్ 28న కనిపించకుండా పోయింది. ఈ సంఘటన జరిగిన నెల తర్వాత బస్ట్‌ స్టాప్‌తోపాటు, స్టీల్ స్ట్రక్చర్ దొంగతనంపై సెప్టెంబర్ 30న ఫిర్యాదు దాఖలైంది. దీంతో బెంగళూరు పోలీసులు  బిఎమ్‌టిసి బస్ షెల్టర్‌ల నిర్మాణాల కంపెనీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ రవిరెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సమీపంలోని భవనాల నుండి CCTV ఫుటేజీని  పరిశీలిస్తున్నారు. ఈ బస్ షెల్టర్‌ను బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) నిర్మించింది.  ఇది బెంగళూరు సిటీ పోలీస్ కమీషనర్ కార్యాలయం వెనుక, విధాన సౌధ నుండి కేవలం 1 కి.మీ దూరంలో  ఉండటం పోలీసులకు మరింత సవాల్‌గా మారింది.

ఇక ఇలాంటి వరుస సంఘటల  విషయానికి వస్తే..అంతకుముందు 1990లో లయన్స్‌ క్లబ్‌ విరాళంగా ఇచ్చిన కళ్యాణ్‌నగర్‌ బస్టాండ్‌ అదృశ్యమైంది. మరేదో వ్యాపార సముదాయ నిర్మాణం కోసం ఈ చోరీ జరిగిందని ఆ ప్రాంత నివాసితులను ఉటంకిస్తూ మీడియా నివేదికను ఉటంకిస్తూ ఇండియా టుడే నివేదించింది. 2015లో హారిజన్ స్కూల్ సమీపంలోని దూపనహళ్లి బస్ స్టాప్ రాత్రిపూటఅదృశ్యమైందని నివేదిక పేర్కొంది. గతంలో 2014లో రాజరాజేశ్వరినగర్‌లోని బీఈఎంఎల్‌ లేఅవుట్‌ 3వ స్టేజీలో 20 ఏళ్ల నాటి బస్టాప్‌ కనిపించకుండా పోయింది.

మరిన్ని వార్తలు