దారుణం: అన్న చేతిలో తమ్ముడి హత్య

2 Jun, 2019 13:10 IST|Sakshi

కుటుంబ తగాదాలే కారణం

సూర్యాపేట మండలం కేసారంలో ఘటన

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సూర్యాపేటరూరల్‌ : అన్న చేతిలో ఓ తుమ్ముడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన  సూర్యాపేట మండలంలోని కేసారం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసారం గ్రామానికి చెందిన గోగుల లింగారెడ్డి ప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు.పెద్ద కుమారుడు గోపాల్‌రెడ్డి తమకున్న రెండున్నర ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. చిన్న కుమారుడు శేఖర్‌రెడ్డి (28) ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. శేఖర్‌రెడ్డి కొంత కాలంగా మద్యానికి బానిసై లక్ష రూపాయలు తనకు కావాలంటూ తరచూ తన అన్న గోపాల్‌రెడ్డి, తల్లి ప్రమీలను వేధిస్తున్నాడు.

శనివారం పూటుగా మద్యం సేవించి వచ్చిన శేఖర్‌రెడ్డి తన అన్న గోపాల్‌రెడ్డిపై లక్ష రూపాయలు తనకు ఇస్తారా లేక ఉన్న భూమిలో తన వాటఇస్తారా అంటూ కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. గోపాల్‌రెడ్డి తన తమ్ముడు శేఖర్‌రెడ్డి వద్ద గల కత్తిని లాక్కొనే ప్రయత్నంలో శేఖర్‌రెడ్డి మెడపై కత్తి తగిలి గాయాలయ్యాయి.  శేఖర్‌రెడ్డి బతికితే ఎలాగైన తనను చంపుతాడనే భయంతో గోపాల్‌రెడ్డి అదే కత్తితో శేఖర్‌రెడ్డిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన శేఖర్‌రెడ్డి ఇంటిలో నుంచి బయటకు వచ్చి ఇంటి ముందు రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు.

పదిహేను నెలల క్రితం 
పదిహేను నెలల క్రితం శేఖర్‌రెడ్డి మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వాలంటూ తరుచూ తన తండ్రి లింగారెడ్డి వేధిస్తూ బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. తల్లిని కూడా తీవ్ర గాయాలపాలు చేశాడు. కన్నతండ్రిని కడతేర్చిన ఘటనలో 90 రోజుల పాటు జైలు జీవితం గడిపి వచ్చినప్పటికి తన ప్రవర్తనలో మార్పు రాలేదు. అదే తరహాలో శేఖర్‌రెడ్డి తన అన్నను, తల్లిని మద్యం సేవించేందుకు డబ్బులు కావాలంటూ అప్పటి నుంచి వేధిస్తూనే ఉన్నాడు. పది రోజుల నుంచి శేఖర్‌రెడ్డి వేధింపులు తట్టుకోలేక కన్న తల్లి, అన్న నిద్రలేని రాత్రులు గడిపినట్లు సమాచారం.

ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ వెంకటేశ్వరరెడ్డి
కేసారం గ్రామంలో గోగుల శేఖర్‌రెడ్డి హత్యకు గురైన విషయాన్ని తెలుసుకున్న సూర్యాపేటరూరల్‌ సీఐ వెంకటేశ్వరరెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలాన్ని చేరుకుని నిందితుడు గోపాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం శేఖర్‌రెడ్డి మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని తల్లి ప్రమీల ఫిర్యాదు మేరకు గోపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనువాస్‌ తెలిపారు.కాగా గోపాల్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు