అన్నదమ్ముల ఆత్మహత్య

1 Jun, 2019 12:12 IST|Sakshi
ఆత్మహత్యకు పాల్పడిన యువకులు

పురుగు మందు తాగిఅఘాయిత్యం

ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానాలు

కృష్ణాజిల్లా, పరిటాల (నందిగామ టౌన్‌) : కంచికచర్ల మండలంలోని పరిటాల చెరువు సమీపంలో అన్నదమ్ములైన ఇద్దరు యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సేకరించిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అన్నదమ్ములు పరిటాల సమీపంలో ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ మణికుమార్‌ విచారణ నిర్వహించి మూలపాడుకు చెందిన జెట్టిబోయిన నరసింహారావు (23), జెట్టిబోయిన వెంకట నరసింహారావు (20) గా ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు. వారు తీసుకొచ్చిన బైకుతోపాటు పురుగు మందు డబ్బాలు లభ్యమయ్యాయని, మృతికి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. పూర్తి విచారణ జరిపి వివరాలు తెలపనున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నందిగామ రూరల్‌ సీఐ సతీష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.

అప్పుల పాలవడంతో..
కాగా, మృతులు నరసింహారావు, వెంకట నరసింహారావు మూలపాడు గ్రామానికి చెందిన జెట్టిబోయిన రామకృష్ణ, కస్తూరి దంపతుల కుమారులు. తండ్రి రామకృష్ణ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నరసింహారావు, వెంకట నరసింహారావు ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. గతంలో వీరు రూ.3 లక్షల మేర అప్పుల పాలయ్యారు. దీనిపై కేసులు పడటంతో అప్పులు కూడా తానే తీర్చినట్లు రామకృష్ణ చెప్పారు. అయితే, గ్రామానికి చెందిన కొందరి సమాచారం మేరకు మృతులు బ్యాంకు ఏటీఎం కేంద్రాలకు నగదు తరలించే వాహనాల్లో పని చేసేవారు. ఆ వాహనాల్లోని సొమ్మును కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని చెబుతున్నారు.

మూలపాడులో విషాద చాయలు..
ఇబ్రహీంపట్నం (మైలవరం) : మూలపాడు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పరిటాల చెరువు వద్ద అనుమానాస్పద స్థితిలో మరణించటంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన జెట్టిబోయిన రామకృష్ణ తాపీ మేస్త్రీగా పనులు చేసుకుంటూ తన రెక్కల కష్టంతో ఇద్దరు కుమారులను చదివించుకున్నాడు. వారిరువురు విజయవాడలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో చిరు ఉద్యోగాలు చేస్తున్నారు. చేతికొస్తున్న జీతాలు కుటుంబ ఖర్చులకు చాలకపోవటంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. దీంతో మనస్తాపానికి గురై ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని కొందరు స్థానికులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో పంట పొలాలకు వినియోగించే పురుగుల మందు డబ్బా ఉండటంతో అనుమానాలకు తావిస్తోంది. ఒకే ఇంట్లో ఇద్దరు యువకులు మృతి చెందటం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. 

మరిన్ని వార్తలు