అన్న కొడుకే సూత్రధారి

27 Nov, 2018 12:43 IST|Sakshi
నిందితుల వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

ఆస్తి వివాదాలతోనే మహేంద్రసింగ్‌ హత్య 

హత్యకు రూ. 8 లక్షల  కిరాయి

విక్రమ్‌సింగ్‌ అరెస్ట్, పరారీలో కిరాయి హంతకులు

ఐదు బృందాల గాలింపు ఎస్పీ ఐశ్వర్య రస్తోగి 

సాక్షి, నెల్లూరు (క్రైమ్‌): ఆస్తి విభేదాలే మహేంద్రసింగ్‌ రాజ్‌పురోహిత్‌ (40) హత్యకు దారి తీశాయి. సొంత అన్న కొడుకే కిరాయి హంతకులతో తుద ముట్టించాడని పోలీసులు నిగ్గుతేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సూత్రధారి విక్రమ్‌సింగ్‌ను పోలీసులు ఆదివారం రాత్రి తిరుపతిలో అరెస్ట్‌ చేశారు. హత్యకు పాల్పడిన కిరాయి హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం స్థానిక ఉమేష్‌చంద్ర మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ  ఐశ్వర్య రస్తోగి  పవర్‌ టూల్స్‌ వ్యాపారి మహేంద్రసింగ్‌ హత్యకు దారి తీసిన పరిస్థితులను వెల్లడించారు. రాజస్థాన్‌ రాష్ట్రం బార్మేర్‌ జిల్లా సంద్రి మండలం ఆర్తండి గ్రామానికి చెందిన మహేంద్రసింగ్‌ రాజ్‌పురోహిత్‌ తన భార్య ఉషాదేవితో కలిసి 15 ఏళ్ల కిందట ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వలస వచ్చారు. ఫత్తేఖాన్‌పేట రైతుబజారు ఎదురుగా అక్కనవారి వీధిలో నివాసం  ఉంటూ అక్కడే కోమల్‌ పవర్‌ టూల్స్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయన అన్న మంగిలాల్‌ కుమారుడు విక్రమ్‌సింగ్‌ చిన్నప్పటి నుంచే బాబాయి మహేంద్రసింగ్‌ వద్ద ఉంటూ వ్యాపారంలో మెళుకువలు నేర్చుకున్నాడు. విక్రమ్‌సింగ్‌కు బాబాయే వివాహం చేశాడు. ఈ క్రమంలో మహేంద్రసింగ్‌ సంతపేటలో పవర్‌ టూల్స్‌ దుకాణం ప్రారంభించి దాని బాధ్యతలను విక్రమసింగ్‌కు అప్పగించాడు. షాపులో మంచి లాభాలు వచ్చాయి. అయితే విక్రమసింగ్‌ డబ్బును కాజేసి నష్టాలను చూపించసాగాడు. దీంతో మహేంద్రసింగ్‌ అతన్ని తిరుపతికి పంపించేశాడు. ఈ క్రమంలో విక్రమ్‌సింగ్‌ ఆర్థికంగా చితికిపోయాడు 
ఆస్తి విషయమే విభేదాలకు కారణం 
గతంలో మహేంద్రసింగ్‌ తన స్వగ్రామంలో తనతో పాటు తన అన్నకు కూడా ఇల్లు కట్టిస్తానని విక్రమసింగ్‌కు మాటిచ్చాడు. అయితే మహేంద్రసింగ్‌ ఒక్కడే తన భార్య పేరిట ఇంటిని నిర్మించుకున్నాడు. తన తండ్రికి ఎందుకు ఇల్లు కట్టించి ఇవ్వలేదని అప్పట్లోనే మహేంద్రసింగ్‌తో విక్రమ్‌సింగ్‌ గొడవ పడ్డాడు. దీంతో విక్రమ్‌సింగ్‌ తన బాబాయిపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా బాబాయిని అడ్డు తొలగించుకుంటే ఆస్తి మొత్తం తనదే అవుతుందని ఏడాదిగా ఆయన హత్యకు పథక రచన చేశాడు. 
మూడో సారి.. గురి చూసి..
నిందితులు మహేంద్రసింగ్‌ కదలికలపై నిఘా ఉంచారు. ఈ ఏడాది వినాయకచవితి సందర్భంగా ఆయన తన స్వగ్రామానికి వెళ్లడంతో అక్కడ ఆయన్ను అంతమొందించేందుకు ప్రయత్నించారు. అయితే స్వగ్రామం కావడం అందరూ తెలిసిన వారే కావడంతో దొరికిపోతారని ఆ ప్రయత్నాని విరమించుకున్నారు. ఆ తర్వాత నిందితులు నెల్లూరుకు చేరుకుని రెండు సార్లు మహేంద్రసింగ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. అది వీలు పడలేదు. ఈ నెల 3వ తేదీ రాత్రి మహేంద్రసింగ్‌ ఇంటికి వెళ్తుండగా నిందితుల్లో ఇద్దరు మోటారు బైక్‌పై వచ్చి తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశారు.
ఐదు బృందాలతో గాలింపు 
మహేంద్రసింగ్‌ హత్య నెల్లూరు జిల్లాలో సంచలనం రేకెత్తించింది. ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఈ ఘటనను సవాల్‌గా తీసుకున్నారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. హతుడి కాల్‌ డిటైల్స్,  ఘటన జరిగిన సమయంలో నగరంలోని సీసీ ఫుటేజ్‌లు, మృతుడితో బంధువులకున్న విభేదాలు తదితర కోణాల్లో క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. విచారణలో విక్రమ్‌సింగ్‌ ఈ దురాఘాతానికి ఒడిగట్టాడన్న సమాచారం అందడంతో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆదివారం రాత్రి తిరుపతిలో విక్రమ్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తరలించారు విచారణ అనంతరం అరెస్ట్‌ చేశారు. హత్యకు పాల్పడిన కిరాయి హంతకుల కోసం బృందాలు మహారాష్ట్ర, రాజస్థాన్‌ల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే నిందితులను అరెస్ట్‌ చేస్తామని ఎస్పీ వెల్లడించారు. 

నిందితుడు విక్రమ్‌సింగ్‌ (ఫైల్‌) 
సిబ్బందికి అభినందన :
మహేంద్రసింగ్‌ హత్య కేసులో చిన్నపాటి క్లూసైతం సిబ్బందికి దొరకలేదన్నారు. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేయడంతో కేసులోని చిక్కుముడి వీడిందని, నిందితుడిని అరెస్ట్‌ చేయగలిగారన్నారు. త్వరితగతిన కేసును ఛేదించిన నగర డీఎస్పీతో పాటు ప్రత్యేక బృందాల్లోని సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ పి. పరమేశ్వర్‌రెడ్డి, నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ అబ్దుల్‌ సుభాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు