అమెరికాలో అకృత్యం : కన్నబిడ్డలు 13 మందిని..

16 Jan, 2018 15:57 IST|Sakshi
10మంది బిడ్డలు, ముగ్గురు కొడుకులతో టర్ఫిన్‌ దంపతులు(చాన్నాళ్ల కిందట నిందితుడి ఎఫ్‌బీలో పోస్టైన ఫొటో)

కాలిఫోర్నియా : ఒక్కరుకాదు ఇద్దరు కాదు సొంతపిల్లలు 13 మందిని చైన్లు, తాళ్లతో కట్టేసి, తిండిపెడ్డకుండా నరకం చూపించారా తల్లిదండ్రులు! తిండిలేక చిక్కిపోయి, తీవ్రమైన దుర్గంధంలో పడిఉన్న వారిని ఎట్టకేలకు పోలీసులు కాపాడారు. అమెరికాలో సంచలనం సృష్టించిన ఈ అకృత్యం కాలిఫోర్నియా రాష్ట్రం రివర్‌సైడ్‌ కంట్రీలోని పెర్రిస్‌ పట్టణంలో వెలుగుచూసింది.

ఓ పాప తప్పించుకుని 911కు ఫోన్‌ చేయడంతో..: డేవిడ్‌ అలెన్‌ టర్ఫిన్‌ - ఆనా టర్ఫిన్‌ దంపతులకు 13 మంది సంతానం. వారంతా 2 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్నవారు. పెర్రిస్‌ శివారులోని రెండస్తుల ఇంట్లో ఉంటున్నారు. అంతమంది పిల్లలున్న ఆ ఇంట్లో.. చాలా నెలలుగా అలికిడి లేకపోయినా చుట్టుపక్కలవారు అంతగా పట్టించుకోలేదు. చైన్లు, తాళ్లతో పిల్లలందరినీ మంచాలకు కట్టేసి, అలెన్‌-ఆనాలు కూడా లోపలే ఉండిపోయారు. బందీలుగా ఉన్న పిల్లల్లో ఓ పాప మొన్న ఆదివారం ఇంట్లో నుంచి తప్పించుకుని 911కు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. నిమిషాల వ్యవధిలోనే పోలీసు బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. దుర్భరస్థితిలో పడిఉన్నవారిలో ఎనిమిది మంది మైనర్లుకాగా, మిగిలిన ఏడుగురూ 18ఏళ్లుపైబడినవారే! బాధితులందరినీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. తల్లిదండ్రుల్ని అరెస్టు చేసి పలుసెక్షన్లకింద కేసు నమోదుచేశారు.

ఎందుకుచేశారిలా? : అలెన్‌-ఆనా దంపతులు సొంతపిల్లలనే ఎందుకు టార్చర్‌ పెట్టారనే కారణాలు ఇంకా తెలియాల్సిఉంది. పిల్లలు ఇంకా షాక్‌లోనే ఉన్నారని, వారు కోలుకున్న తర్వాతే అసలు ఇంట్లో ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు.

పిల్లలు బందీలుగా ఉన్న ఇల్లు, ఇన్‌సెట్‌లో నిందితులు అలెన్‌,ఆనా

 

మరిన్ని వార్తలు