టైరు పంక్చరై..లారీని ఢీకొట్టిన కారు

5 Apr, 2018 11:39 IST|Sakshi
గాయపడ్డ చిన్నారి

తల్లితో సహా ఎనిమిదేళ్ల కొడుకు దుర్మరణం 

మరొకరికి తీవ్రగాయాలు   

నూతన గృహ ప్రవేశం కోసం వెళ్తుండగా ప్రమాదం

కొత్తూరు: రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లి పొత్తిళ్లలో పడుకొని ఉన్న ఏడాది వయసున్న చిన్నారికి తల్లిని శాశ్వతంగా దూరం చేసింది. ఈ హృదయ విదారక ఘటన బుధవారం మండల కేంద్రంలోని బైపాస్‌ వైజంక్షన్‌ కూడలి సమీపంలో చోటు చేసుకొంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నాగర్‌కర్నూల్‌ జిల్లా శ్రీపురం గ్రామానికి చెందిన దుష్యంత్‌రెడ్డి(35), ఆయన తమ్ముడు యశ్వంత్‌రెడ్డిలు హైదరాబాద్‌లోని లింగోజిగూడ, సరూర్‌నగర్‌ ప్రాంతంలో ఉంటూ అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కాగా ఇటీవల స్వగ్రామంలో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు.

నిర్మాణం పూర్తికావడంతో ఈ నెల 7న గృహ ప్రవేశం చేయాలని నిర్ణయించారు. ఏర్పాట్ల కోసం దుష్యంత్‌రెడ్డితో పాటు తల్లి జయశ్రీ,, దుష్యంత్‌రెడ్డి తమ్ముడి భార్య స్వాతి(28), ఆమె పెద్ద కుమారుడు పృథ్విక్‌రెడ్డి(8) చిన్న కుమారుడు రేవంత్‌రెడ్డి(01)లతో కలిసి కారులో గ్రామానికి బయలుదేరారు.

కాగా కొత్తూరు వై జంక్షన్‌ సమీపంలోకి రాగానే కారు ముందు టైర్‌ పంక్చర్‌ కావడంతో అదుపు తప్పి డివైడర్‌పై నుండి దూసుకొచ్చి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చున్న స్వాతి, పృథ్విక్‌రెడ్డిలు కారులో నుండి ఎగిరి పడి అక్కడికక్కడే మృతి చెందారు.

డ్రైవింగ్‌ చేస్తున్న దుష్యంత్‌రెడ్డి తీవ్రంగా గాయపడగా ఆయన తల్లి జయశ్రీ, చిన్నారి బాలుడు రేవంత్‌రెడ్డి(1) స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ఈఎంటీ సుధాకర్‌ అక్కడకు చేరుకొని వారికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన  వైద్యం కోసం షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

అనంతరం అక్కడకు చేరుకొన్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై నుజ్జునుజ్జయిన కారును క్రేన్‌ సహాయంతో పక్కకు తొలగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీశైలం తెలిపారు.

మరిన్ని వార్తలు