అనుచిత పోస్టింగ్‌లపై కేసు నమోదు

22 Aug, 2019 04:13 IST|Sakshi
నల్లపాడులో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న రాష్ట్ర యాదవ సంఘం నేతలు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌లపై సోషల్‌ మీడియాలో  అనుచిత పోస్టింగ్‌లు పెట్టడంపై బుధవారం పోలీసులుకేసు నమోదు చేశారు. సీఎం, మంత్రిని కులం పేరుతో దూషిస్తూ అసభ్య పదజాలంతో కొంత మంది ఫేస్‌బుక్‌లో పోస్టింగులు పెట్టి వైరల్‌ చేశారు. వీటిపై కృష్ణా జిల్లా సత్యనారాయణపురం, తిరువూరు, ఏ కొండూరు పోలీసుస్టేషన్లలో అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఇందుకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలంటూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.   

అరెస్టు చేయాలి.. ఫిర్యాదుల వెల్లువ..
కుల వృత్తులను కించపరుస్తూ సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్టులను వెంటనే అరెస్ట్‌ చేయాలని రాష్ట్ర యాదవ సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం గుంటూరు రూరల్‌ మండలం నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ సీఐ కె.వీరాస్వామికి ఫిర్యాదు చేశారు. యాదవుల గురించి సోషల్‌ మీడియాలో మాట్లాడిన వ్యక్తి గతంలో టీడీపీ ప్రచారకర్తగా పని చేశాడని, అనుచిత వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా యాదవుల మనోభావాలను దెబ్బతీశాడన్నారు. కాగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌లపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని బీసీ నాయకుడు పడమటి జగదీష్కుమార్‌ బుధవారం గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

శృతి మించిన విద్వేషం...
పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్‌సీపీ బీసీ నేతలు 

పులివెందుల: తెలుగుదేశం పార్టీ నేతలకు యాదవులంటే ఎందుకంత అక్కసు? అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన కార్యనిర్వాహక అధ్యక్షుడు హరీష్కుమార్‌ యాదవ్‌ బుధవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలినా.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌లను అసభ్య పదజాలంతో దూషించే స్క్రిప్టు వీడియోలను చంద్రబాబు, లోకేష్‌ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి రాక్షాసానందం పొందుతున్నారని మండిపడ్డారు. వరద పరిస్థితులను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదుకున్న ప్రభుత్వ యంత్రాంగాన్ని, మంత్రులను మెచ్చుకోవాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. యాదవ సామాజికవర్గంపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. 

మరిన్ని వార్తలు