సెల్‌ పోతే గోవిందా..

10 Dec, 2018 11:05 IST|Sakshi

జిల్లాలో పెరుగుతున్న సెల్‌ఫోన్‌ చోరీలు

ప్రతినెలా 700 పైగా మాయం

ఐఎంఈఐ నెంబర్లు మార్చేస్తున్న వైనం

ఇతర రాష్ట్రాల్లో యథేచ్ఛగా విక్రయాలు

గడిచిన 10 నెలల్లో 2 వేలకు పైగా ఫిర్యాదులు

ప్రస్తుతం మార్కెట్‌లోకి వివిధ ఫీచర్లున్న సెల్‌ ఫోన్లు వస్తున్నాయి. ఖరీదు ఎక్కువైనా యువత వాటిని వినియోగించేందుకు ఇష్టపడుతున్నారు. వాటిని పోగొట్టుకుంటే మాత్రం అంతే సంగతులు. దొంగలు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఫోన్లలో ఉన్న సెక్యూరిటీ నెంబర్లను తొలగిస్తున్నా రు. ఐఎంఈఐ నెంబర్లను మార్చేసి సెకండ్‌ హ్యాండ్‌ కింద మార్కెట్‌లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. జాగ్రత్త పడితే తప్ప ఏమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేస్తున్నారు.

తిరుపతి క్రైం: జిల్లాలో ఈ మధ్య కాలంలో సెల్‌ఫోన్‌ దొంగలు ఎక్కువయ్యారు. రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లను టార్గెట్‌ చేసుకుని దోచేస్తున్నారు. జిల్లాలో ప్రతినెలా సుమారు 700లకు పైగా మొబైల్‌ ఫోన్లు చోరీకి గురువుతున్నట్టు సమాచారం. గడిచిన ఏడు నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా 2 వేలకు పైగా మొబైల్స్‌ పోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సెల్‌ఫోన్‌ చోరీలను అంతర్రాష్ట్ర ముఠాలే కాకుండా చిన్నపాటి నేరాలకు డబ్బులకు అలవాటుపడిన ఆకతాయిలు కూడా చేస్తున్నారు. ఇందులో ఇంజినీరింగ్‌ విద్యార్థులు, హై క్లాస్‌ డిగ్రీలు చదువుకున్న విద్యార్థులు సైతం ఉండడం ఆందోళన కలిగించే అంశం.

ఖరీదైన ఫోన్లే టార్గెట్‌
జల్సాలకు అలవాటుపడిన యువకులు అడ్డదారులు తొక్కుతున్నారు. స్నేహితులు, బంధువుల వద్దే సెల్‌ఫోన్లు కాజేస్తున్నారు. చెన్నై, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలకు చెందిన వారు సైతం సెల్‌ఫోన్లనే టార్గెట్‌ చేస్తున్నారు. తొందరపాటులో సాధారణ ఫోన్లను కాజేసినా కాలువల్లో పడేస్తున్నారు. రూ.10వేలు ఆపై రేటు పలికే మొబైల్స్‌నే చోరీ చేస్తున్నారు.

ఫోన్‌ కోడ్‌ మార్చేసి.. విక్రయాలు
పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు సెల్‌ఫోన్‌ భద్రతకు సంబంధించిన కోడ్‌ (ఐఎంఈఐ) నెంబర్‌ను పూర్తిగా తొలగిస్తారు. ఆధునిక టెక్నాలజీతో కొత్త నెంబర్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు. ఇందుకోసం మొబైల్‌ వ్యాపారులు, ఐటీ నిపుణులు, ఇంజినీరింగ్‌ విద్యార్థుల సాయం తీసుకుంటున్నారు. మొబైల్‌ రేటును బట్టి వారికి డబ్బులు చెల్లిస్తున్నారు. ఆర్థికంగా మంచి లాభాలు ఉండడంతో ఐటీ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులు ఇలాంటివి నేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్నట్టు సమాచారం. తర్వాత వాటిని పొరుగు రాష్ట్రాలకు పంపి మంచి ధరకు విక్రయిస్తున్నారు.

ఫిర్యాదుకు ఆసక్తి చూపని బాధితులు
మొబైల్‌ పోయిందంటూ ఫిర్యాదు చేసేందుకు చాలా మంది బాధితులు ఆసక్తి చూపడంలేదు. విలువైన మొబైల్స్‌ పోయినప్పుడు మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. చోరీ చేసిన మొబైల్స్‌ను విక్రయించే స్థలాలను పోలీసులు గుర్తించినా నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సంఘటనల్లో దొంగలు దొరికినా ఉన్నతస్థాయి అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి కేసుల నమోదుకు వెనుకంజ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రతి ఒక్కరిదీ ఒక స్టైల్‌
మొబైల్‌ దొంగతనాల్లో ఎవరి స్టైల్‌ వారిదే. జిల్లాలో ఆరు విభిన్న తరహాలో సెల్‌ఫోన్ల చోరీ జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దుండగులు పక్కనే ఉంటూ అవకాశం కోసం ఎదురు చూస్తారు. ఏమరపాటుగా ఉన్న సమయంలో ఫోన్లను చాకచక్యంగా అపహరిస్తున్నారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో ఎక్కువగా చోరీలకు పాల్పడుతున్నారు.
ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సులో కిటికీ వైపు పడుకుని ఉన్నాడు. ఒక యువకుడు అతన్ని గమనించాడు. నిద్రమత్తులో ఉన్న అతని జేబులోని సెల్‌ ఫోన్‌ను చాకచక్యంగా కొట్టేశాడు.
పట్టుమని పదేళ్లు కూడా నిండని ఓ బాలుడు చేతిలో కవరు పెట్టుకుని కూరగాయల మార్కెట్‌లో తిరుగుతూ వంగి కూరగాయలు ఏరే సమయంలో ఆ కవరు ప్యాంట్‌ జేబుకు అడ్డుపెట్టి మెల్లగా సెల్‌ఫోన్‌ను కాజేస్తాడు.
షేర్‌ ఆటోలో అధిక రద్దీ ఉన్న సమయం చూసి అతనికి ఏ జేబు దొరికితే ఆ జేబులోని మొబైల్‌ కాజేసి చాకచక్యంగా పరారవుతాడు.

రికవరీ చేస్తున్నాం
నిత్యం ఎక్కడో ఒక చోట సెల్‌ఫోన్‌లు పోతూనే ఉన్నాయి. ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో నెలకు 8 ఫిర్యాదులు అందుతున్నాయి. ఇందులో 50 నుంచి 60 శాతం వరకు సెల్‌ఫోన్లను రికవరీ చేస్తున్నాం. చాలా వరకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దొరుకుతున్నాయి. స్థానిక పోలీసుల సాయంతో వాటిని తెప్పించి బాధితులకు అందజేస్తున్నాం. ప్రజలు రద్దీ ప్రాంతాల్లో మొబైల్స్‌ను జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది.     – మునిరామయ్య, ఈస్టు సబ్‌ డివిజనల్‌ డీఎస్పీ

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా