డ్రైవరే దొంగ!

24 Jul, 2018 08:46 IST|Sakshi
కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగేశ్వరరావు, లారీలో లోడై ఉన్న సెల్‌ఫోన్‌ బాక్స్‌లు

సెల్‌ఫోన్ల లోడ్‌ లారీ అపహరణ కేసు ఛేదించిన పోలీసులు

నిందితుడు లారీ డ్రైవర్‌గా గుర్తించి అరెస్టు చేసిన ఖాకీలు

రూ.7.25 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు అమ్ముకోవాలని చూసిన డ్రైవర్‌

విలేకరులకు వివరాలు వెల్లడించిన దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు 

అద్దంకి (ప్రకాశం): చెడు వ్యసనాలకు బానిస కావడం.. తాను కొనుగోలు చేసిన లారీలకు కిస్తీలు చెల్లించలేకపోవడంతో ఆ డ్రైవర్‌ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. తన లారీలో లోడైన సెల్‌ఫోన్‌లు విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూసిన డ్రైవర్‌ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.  దర్శి డీఎస్సీ నాగేశ్వరరావు స్థానిక సీఐ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా వానియంబాడి తాలూకా మెట్టుపాలయమ్‌ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ కొడగంటి రంగనాథన్‌ లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తుంటాడు. చిత్తూరు జిల్లా శ్రీ సిటీ నుంచి రూ.7,25,67,582 విలువైన రెడ్‌మీ నోట్‌ ఎంఐ ఫోన్‌ల లోడ్‌తో కలకత్తాలోని హుగ్లీకి బయల్దేరింది.

లారీ ఈ నెల 18వ తేదీ రాత్రి 9 గంటలకు ఐదో నంబర్‌ జాతీయ రహదారి పక్కనే ఉన్న పంజాబీ దాబా వద్ద నిలిపాడు. మేదరమెట్ల వెళ్లి వచ్చే సరికి 6400 రెడ్‌మీ కంపెనీ సెల్‌ఫోన్‌లు ఉన్న లారీ అపహరణకు గురైందంటూ ఈ నెల 19న లారీ డ్రైవర్‌ మేదరమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు వివిధ బృందాలుగా ఏర్పడి లారీ కోసం గాలించారు. చివరకు లారీ అద్దంకి మండలం కొంగపాడు పొలాల్లోని సుబాబుల్‌ తోటల్లో గుర్తించారు.

లారీని ఎవరూ అపహరించలేదని, అపహరిస్తే అక్కడ ఎందుకు వది వెళ్లారనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగింది. డ్రైవర్‌ను తమ దైనశైలిలో విచారించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. తన అప్పుల కోసం సెల్‌ఫోన్‌ లోడ్‌ లారీని మాయం చేసినట్లు డ్రైవరే నేరం అంగీకరించాడు. పోలీసులు ఆయన్ను కటకటాల వెనక్కి నెట్టారు. లోడ్‌ లారీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టుకు హాజరు పరిచినట్లు డీఎస్పీ చెప్పారు. కేసును ఛేదించిన సీఐ హైమారావు, మేదరమెట్ల ఎస్‌ఐ పాండురంగారావు, హెచ్‌సీ కోటేశ్వరరావు, అంజుల్లా బృందాన్ని డీఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు