చోరీ చేసిన బైక్‌లతోనే స్నాచింగ్‌లు

4 May, 2019 06:49 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు

చైన్‌ స్నాచింగ్‌ ముఠా అరెస్ట్‌

రూ.4 లక్షల విలువైన బంగారం

బైక్‌లు, సెల్‌ ఫోన్లు స్వాధీనం

సీసీ పుటేజీల ఆధారంగా నిందితుల పట్టివేత  

గచ్చిబౌలి: బైక్‌లు చోరీ చేసి వాటిపై తిరుగుతూ చైన్‌ స్నాచింగ్‌లు, సెల్‌ఫోన్‌ చోరీలకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్‌ ఎస్‌ఓటీ, కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ వీసీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు. బోరబండకు చెందిన దస్తగిరి, శివ కుమార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బండారి సాయిరాం అలియాస్‌ సాయి, మరో బాలుడు ముఠాగా ఏర్పడి బైక్‌ల చోరీ, చైన్, సెల్‌ ఫోన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అపాచీ, యూనికాన్‌ బైక్‌లతో పాటు స్కూటీని చోరీ చేసిన వీరు అదే బైక్‌లపై కాలనీల్లో తిరుగుతూ తెల్లవారు జామున 4.30 గంటల నుంచి 5 .30 గంటల ప్రాంతంలో ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్‌ చేసుకుని స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ Ðð వెళుతున్న మహిళల నుంచి ఫోన్లు లాక్కెళ్లేవారు.

ఇదే తరహాలో వీరు కేపీహెచ్‌బీ పరిధిలో మూడు చైన్‌ స్నాచింగ్‌లు,  బాచుపల్లి, మాదాపూర్, నార్సింగి పరిధిలో ఒక చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు బైక్‌లు, మాదాపూర్‌ పీఎస్‌ పరిధిలో సెల్‌ఫోన్‌ చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారి కోసం గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.4 లక్షల విలువైన 86 గ్రాముల బంగారు నగలు, మూడు బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన దస్తగిరిపై 11 బైక్‌ చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. జైలుకు వెళ్లి వచ్చిన అతను జల్సాలకు అలవాటు పడి మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడన్నారు. నిందితులతో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేస్తున్న మహబూబ్‌ పాషా అనే వ్యక్తిని కూడా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: సీపీ
ప్రతి ఒక్కరూ విధిగా ఇంటి ముందు సీసీ కెమెరా అమర్చుకోవాలని సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ సూచించారు. నేరాలను చేధించడమే కాకుండా నేరాల సంఖ్య తగ్గించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. 13 నెలల్లో సైబరాబాద్‌ కమిషనరేట్‌లో 75వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, త్వరలో వాటి సంఖ్య లక్షకు చేరుకుంటుందన్నారు. సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు స్థానిక పీఎస్‌లో సంప్రదిస్తే సహకారం అందిస్తామన్నారు. సమావేశంలో మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ దయానంద్‌రెడ్డి, కూకట్‌పల్లి ఏసీపీ బి. సురేందర్‌రావు, డీఐ సైదులు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు