కూతుర్ని చంపి.. తానూ చావాలనుకున్నాడు!

21 Sep, 2018 02:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. తనను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని.. కన్న కూతురినే కడతేర్చాలనుకున్నాడు.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. ఇదీ బుధవా రం హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో కన్న కూతురుపైనే కత్తితో దాడిచేసిన మనోహరాచారి ఆలోచన. కత్తి దాడి తర్వాత కూతురు మాధవి చనిపోయిందని భావించాడు. దీంతో రైలు కింద పడి చనిపోవాలనుకున్నాడు.

ఈ విషయాన్ని భార్య లక్ష్మికి ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో ఆమె ఎస్సార్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించింది. బుధవారం సాయంత్రం 3 గంటలు గాలించి మనోహరాచారిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం నిందితుడిని జుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. కేసులో మరిన్ని అంశాలు తెలుసుకోవడానికి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. మనోహరాచారి ఘా తుకానికి ఒడిగట్టడం వెనుక మిర్యాలగూడ దారుణం ప్రభావమున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

పరీక్ష కలిపింది ఇద్దరినీ..
మనోహరాచారి స్వస్థలం కర్నూలు జిల్లా. ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సీఎంగా ఉండగా ఆ జిల్లాలో కీలక ఫ్యాక్షన్‌ లీడర్ల వెనుక తిరిగి ఆర్థి కంగా చితికిపోయాడు. విశ్వబ్రాహ్మణ కులానికి చెం దిన వాడు కావడంతో ఆ వృత్తి చేసుకుని బతికేందుకు దాదాపు 20 ఏళ్ల కింద హైదరాబాద్‌కు వలసొచ్చాడు. ప్రస్తుతం అమీర్‌పేటలోని ఓ జ్యువెలరీ దుకా ణం బయట ఆభరణాలకు మెరుగుపెట్టే పని చేస్తున్నాడు.

కుమారుడు ఓ ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తుండగా, భార్య లక్ష్మి హైటెక్‌సిటీలో చిన్న ఉద్యో గం చేస్తోంది. ఆయన కుమార్తె మాధవి 2013లో మోతీనగర్‌లోని డాన్‌బాస్కో స్కూల్‌ పరీక్ష కేంద్రం లో పదో తరగతి పరీక్షలు రాసింది. అదే కేంద్రంలో సందీప్‌ పరీక్ష రాశాడు. వీరి నంబర్లు ముందు, వెనుక రావడంతో పరీక్షలు పూర్తయ్యేలోపు వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. మాధవాచారి కుటుంబం బోరబండ రాజ్‌నగర్‌ బస్తీలో, సందీప్‌ కుటుంబం ఎర్రగడ్డలోని ప్రేమ్‌నగర్‌లో నివసిస్తోంది.

ఆర్య సమాజ్‌లో పెళ్లి..
వీరి వివాహానికి సందీప్‌ కుటుంబం అంగీకరించినా మాధవి తరఫు వారు మాత్రం కుల పట్టింపుతో సమేమిరా అన్నారు. దీంతో వీరిద్దరూ గత బుధవారం మాధవి కుటుంబీకులకు తెలియకుండా ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించగా, ఇరువురూ మేజర్లు కావడంతో వారి కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చి సందీప్‌తో మాధవిని పంపారు. ఆ సమయంలో సందీప్‌ ఏం చేస్తున్నాడని పోలీసులు ఆరా తీశారు. ఓ బిర్యానీ సెంటర్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తూ నెలకు రూ.8 వేలు సంపాదిస్తున్నానని చెప్పాడు.  

తనను లెక్కచేయట్లేదని..
వారిద్దరూ సందీప్‌ ఇంట్లోనే ఉంటు న్నారు. గడిచిన వారం రోజుల్లో మనోహరాచారి సందీప్‌ ఇంటికి 3సార్లు వెళ్లాడు. అతడి తల్లిని అమ్మా అని సంబోధిస్తూ తన కుమార్తెను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. అయితే 4 రోజుల కింద జరిగిన ఓ ఘటనతో మనోహరాచారి మానసికంగా కుంగిపోయాడు.

పెద్ద మనుషుల సమక్షంలో సందీప్‌ ఇంట్లో పంచాయితీ జరిగింది. ఆ సందర్భంగా ఓ దశలో నీ కుమార్తె వస్తే తీసుకెళ్లండంటూ సందీప్‌ మనో హరాచారితో అన్నాడు. తనతో రావాలని తండ్రి కోరగా.. తనకు భర్తే సర్వస్వమని, కులమతాలకు అతీతంగా తాము కలసి ఉంటామని మాధవి చెప్పింది. దీంతో మానసికంగా దెబ్బతిన్న మనోహరాచారి ఆ తర్వాత మూడుసార్లు ఫోన్‌ చేసినా కుమార్తె నుంచి స్పందన రాలేదు. దీంతో తనను ఎదిరించడమే కాకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆమెపై కక్షకట్టాడు.

కూతురిని ఒంటరిగా రమ్మన్నాడు..
తీవ్ర మనస్తాపానికి గురైన మనోహరాచారి రెండు రోజులుగా ముభావంగా ఉండటంతో పాటు మితిమీరి మద్యం తాగుతున్నాడు. మిర్యాలగూడలో చోటుచేసుకున్న ప్రణయ్‌ హత్యోదంతాన్ని మీడియాలో చూసి ప్రభావితమయ్యాడు. తీవ్ర ఉద్రేకానికి గురై కుమార్తెను మట్టుపెట్టాలని భావించాడు. మాధవికి ఫోన్‌ చేసి దుస్తులు కొనేందుకు ఎర్రగడ్డ రావాలని కోరాడు. సందీప్‌ పనికి వెళ్లి ఉంటాడని, ఇద్దరూ కలసి రారనే భావించాడు. ఫోన్‌ చేశాక బైక్‌పై ఎస్సార్‌నగర్‌ వెళ్లి మద్యం కొనుకున్నాడు. అమీర్‌పేటలోని సత్యం థియేటర్‌ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఆ మద్యం తాగాడు.

కత్తి దొరక్కపోయి ఉంటే..
మద్యం మత్తులోనే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మైత్రీ వనం వైపు వస్తూ.. ఓ కొబ్బరిబొండాల దుకాణం వద్దకు చేరుకుని లోపలకు వెళ్లి కొద్ది సేపు ఆగాడు. విజయనగరం నుంచి వలస వచ్చిన దాని యజమాని మూత్ర విసర్జనకు వెళ్లగా అక్కడున్న కొబ్బరి బొండాలు నరికే కత్తిని దొంగిలించి తన బ్యాగ్‌లో పెట్టుకుని బైక్‌పై బయల్దేరాడు.

ఈ దృశ్యాలు బొండాల దుకాణం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫీడ్‌ను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కాగా, తాను గోకుల్‌ థియేటర్‌ వద్ద ఉన్నానంటూ కుమార్తె నుంచి మనోహరాచారికి ఫోన్‌ వచ్చింది. 3.30–3.45 గంటల మధ్య అక్కడకు చేరుకున్న మనోహరాచారి.. కుమార్తె వెంట సందీప్‌ను చూసి మొదట అతడిపై, ఆ తర్వాత మాధవిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. కొబ్బరి బొండాల దుకాణంలో ఆ కత్తి దొరక్కపోయి ఉంటే కథ వేరేలా ఉండేదని పోలీసులు అంటున్నారు.

రెండు మూడుసార్లు పథకం..
ఎంతో గారాబంగా పెంచిన కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తనకు తీవ్ర ఆగ్రహన్ని తెప్పించిందని మనోహరాచారి పేర్కొన్నాడు. మాధవిని మాత్రమే చంపాలని నిర్ణయించుకునట్లు చెప్పాడు. రెండు మూడు సార్లు పథకం వేసినా మాధవి, సందీప్‌ కలసి రావడంతో వదిలిపెట్టినట్లు తెలిపాడు. రద్దీ ప్రాంతానికి పిలిస్తే అనుమానం రాకుండా వస్తారనే భావనతో ఎర్రగడ్డకు పిలిపించానని మనోహరాచారి వివరించాడు. దాడి అనంతరం రోడ్డు దాటి ఆటోలో బల్కంపేట మీదుగా లాల్‌బంగ్లా వద్ద ఆటో దిగి మక్తాలోకి వెళ్లానని చెప్పాడు.  

భయం భయంగా..
హత్యాయత్నానికి పాల్పడ్డ మనోహరాచారి భార్యా, కుమారుడు భయంతో గడుపుతున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకూ భయపడుతున్నారు. బోరబండలో ఉన్న వారి ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాతో మాట్లాడేందుకు సైతం వారు ధైర్యం చేయలేకపోతున్నారు.  

మాల కులంలో పుట్టడమే నేరమా: సందీప్‌ తల్లి రమాదేవి
మాల కులంలో పుట్టడమే తప్పా. నా కొడుకు, మాధవి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెను సొంత కూతురిలా చూసుకున్నాను. తమ పుట్టింటి కంటే ఇక్కడే బాగుందని చెప్పింది. కొడుకు, కోడలు జంట ఎంతో బాగుందనుకున్నాను. కానీ అంతలోనే ఈ దారుణం జరిగింది.

నిలకడగా మాధవి పరిస్థితి..
కాగా, యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధవి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. గురువారం సాయంత్రం వెంటిలేటర్‌ కూడా తొలగించారు. ఆమెకు ప్రాణాపాయమేమీ లేదని, ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు వెల్లడించారు. ఎమ్మార్పీఎస్‌ నేత మందకృష్ణ మాదిగ, కుల నిర్మూలన పోరాట సమితి, తదితర ప్రజా సంఘాల ప్రతినిధులు గురువారం యశోద ఆసుపత్రిలో మాధవిని పరామర్శించారు.

నమ్మించి దాడి చేశాడు: సందీప్‌
తమ వివాహన్ని మాధవి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించడం వల్లే తాము ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నామని సందీప్‌ తెలిపాడు. గురువారం ఆస్పత్రి నుంచి సందీప్‌ డిచ్చార్జి అయ్యాడు. 2015లో తమ ప్రేమ విషయం మాధవి ఇంట్లో తెలిసి తల్లి లక్ష్మి, సోదరుడు వచ్చి బెదిరించి వెళ్లారని చెప్పాడు. తమ పెళ్లయ్యాక పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చిన సందర్భంగా మాధవి కోసం దాచిన రూ.5 లక్షలు ఇస్తానని మనోహరాచారి చెప్పినట్లు తెలిపాడు. వివాహ విందుకు దుస్తులు ఇప్పిస్తానని నమ్మించి దాడి చేశాడని చెప్పాడు. ఎప్పటికైనా తనను, తన భార్యను చంపేస్తాడేమోనని భయంగా ఉందని, తమ కుటుంబానికి భద్రత కావాలని కోరాడు.


చనిపోయిందనుకుని..
రక్తపు మడుగులో పడిఉన్న మాధవిని చూసి చనిపోయిందని భావించి పారిపోయాడు. కొద్దిసేపటికే భార్య లక్ష్మికి ఫోన్‌ చేసి.. మాధవిని చంపేశానని, కుమారుడిని జాగ్రత్తగా చూసుకొమ్మని, తాను రైలు కింద పడి చనిపోతున్నానని చెప్పాడు. దీంతో లక్ష్మి ఎస్సార్‌నగర్‌ పోలీసులకు చెప్పింది. సనత్‌నగర్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు ఉన్న రైల్వే ట్రాక్‌లపై 3 గంటల పాటు గాలించారు. చివరకు మక్తా వద్ద రైలు పట్టాల సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పంజగుట్ట ఏసీపీ కార్యాలయానికి తరలించిన తర్వాతే అతడికి మాధవి బతికుందనే విషయం తెలిసింది. గురువారం ఉదయానికి మద్యం మత్తు దిగినాక కూడా నిందితుడిలో ఎలాంటి పశ్చాత్తాప ఛాయలు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు