న్యాయం చేయమంటే.. రూమ్‌కు రమ్మన్నాడు!

19 Sep, 2018 08:19 IST|Sakshi

సీఐ లైంగికంగా వేధిస్తున్నాడంటూ మీడియాను ఆశ్రయించిన మహిళ

తిరుమలలోని తన రూమ్‌కు రావాలంటున్నాడని ఆరోపణ

తిరుమల: తిరుమల పుణ్యక్షేత్రం ఓవైపు భక్తుల సందడి, గోవిందనామాల స్మరణతో మారుమోగుతుంటే.. మరోవైపు వారికి రక్షణ కల్పించాల్సిన ఓ సీఐ కీచకుడి అవతారమెత్తాడు. న్యాయం చేయాలని కోరిన ఓ మహిళను తిరుమలలోని రూమ్‌కు రావాలంటూ అసభ్యకరంగా, లైంగికంగా వేధించాడు. దీంతో ఆ మహిళ మంగళవారం తిరుమలలో బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం వద్దకు చేరుకొని అక్కడున్న విలేకరుల ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. పీలేరుకు చెందిన తాను భర్త వేధిస్తుంటే పదేళ్ల కిందట కేసు పెట్టినట్లు చెప్పింది. ఆ కేసు కోర్టులో ఉందన్నారు. అయితే తన భర్త విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఈ విషయం తెలిసిందని.. అదే రోజున తన భర్తపై మరో కేసు పెట్టినట్లు తెలిపింది.

అయితే అప్పుడున్న సీఐ బదిలీ అవ్వగా.. సిద్దతేజమూర్తి ఇన్‌చార్జి సీఐ (వాల్మీకిపురం)గా బాధ్యతలు స్వీకరించారని వివరించింది. దీంతో ఆయన్ని కలిసి తనకు న్యాయం చేయాలని కోరగా.. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడని వాపోయింది. ఓసారి రాయచోటి వద్దనున్న గాలివీడులోని వారి సమీప బంధువుల ఇంటికి తీసుకెళ్లి బలవంతం చేయబోగా.. అరిచి అందరినీ పిలిచి పరువు తీస్తానని చెప్పడంతో వెనక్కి తగ్గాడని తెలిపింది. మరోసారి ఇలా తిక్క వేషాలేస్తే డీఎస్పీ, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించినా కూడా లెక్కచేయకుండా ‘వాళ్లు కూడా పోలీసులే. నన్నేం చేయరు’ అని సమాధానమిచ్చి.. బెదిరించడం మొదలుపెట్టాడని ఆరోపించింది. రెండు రోజుల కిందట ఫోన్‌ చేసి.. తిరుమల బ్రహ్మోత్సవాల కోసం తనకు డ్యూటీ వేశారని, నందకంలో రూము తీసుకుంటా.. వెంటనే రావాలంటూ బెదిరించాడని వాపోయింది. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లేందుకు తిరుమలకు వచ్చానని.. కానీ ఆయన బ్రహ్మోత్సవాల్లో బిజీగా వుండడంతో కలిసే అవకాశం లేకుండా పోయిందని తెలిపింది. వాట్సాప్‌ మెసేజ్‌లు చూపించడంతో పాటు వాయిస్‌ రికార్డులను విలేకరులకు వినిపించింది. సీఐ సిద్దతేజమూర్తిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి న్యాయం కోరుతానని తెలిపింది. కాగా, సీఐని సస్పెండ్‌ చేస్తూకర్నూలు డీఐజీ ఉత్తర్వులిచ్చారు.

మరిన్ని వార్తలు