పెళ్లయిన పది నెలలకే..

4 Jun, 2018 12:18 IST|Sakshi
మధుకుమార్, సుబ్బలక్ష్మి (ఫైల్‌) ,మృతి చెందిన సుబ్బలక్ష్మి

కానిస్టేబుల్‌కు అదనపు కట్నం ఆశ

భార్యకు నిత్యం వేధింపులు

మనస్తాపంతో ఆత్మహత్య

మృతురాలి కుటుంబీకుల ఆందోళన

నంద్యాల: అతను కానిస్టేబుల్‌ కావడంతో అడిగినంత కట్నం ఇచ్చారు. తమ కుమార్తె క్షేమంగా ఉంటే చాలని భారమైనా అల్లుడు ఏదడిగినా కాదనలేదు. పెళ్లయిన కొన్నాళ్లకే అతని నిజ స్వరూపం బయటపడింది. అదనపు కట్నం కోసం కూతురును వేధించడం మొదలు పెట్టాడు. పెద్దలు సర్ది చెప్పినా అతని తీరు మారలేదు. చివరకు వేధింపులు తట్టుకోలేక పుట్టినింటికి చేరిన ఆమె తల్లిదండ్రులకు భారం కాకూడదని తనువు చాలించింది. ఈ విషాద ఘటన నంద్యాల తాలుకా పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.   

నంద్యాల మండలం పుసులూరు గ్రామానికి చెందిన సుబ్బరాయుడు, ఆదీశ్వరమ్మ దంపతుల కుమార్తె సుబ్బలక్ష్మి(22)కి పాణ్యం మండలం భూపనపాడు గ్రామానికి చెందిన మేకల పాపన్న, సుబ్బమ్మ కుమారుడు మధుకుమార్‌తో పది నెలల క్రితం వివాహమైంది. మధుకుమార్‌ ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు. పెళ్లి సమయంలో రూ.8 లక్షలు, 20 తులాల బంగారం కట్నం కింద ఇచ్చా రు. పెళ్లి అయినప్పటి నుంచి సుబ్బలక్ష్మిని అదనపు కట్నం తీసుకురావాలని అత్తామామ, భర్త వేధించడం మొదలు పెట్టారు. విషయం తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా సర్దిచెప్పారు.  అయినా వేధింపులు ఆగకపోవడంతో పాటు ఇటీవల సుబ్బలక్ష్మిని భర్త కొట్టడంతో ఆమె పుట్టింటికి చేరింది. ఓ వైపు అత్తింటి వేధింపులు తాళలేక.. మరో వైపు తన సమస్య తల్లిదండ్రులకు భారం కాకూడదని శనివారం పురుగు మందు తాగి అప స్మారక స్థితికి చేరింది. బంధువులు పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతి చెందిం ది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. 

తాలూకా పోలీస్‌స్టేషన్‌ ముట్టడి..
ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ మధుకుమార్, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని మృతురాలి బంధువులు తాలూకా పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఆదివారం సాయంత్రం దాదాపు 100 మందికి పైగా స్టేషన్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. సుబ్బలక్ష్మి మృతికి కారకులైన వారిని అరెస్ట్‌ చేసేంత వరకు కదలమని భీష్మించారు. మధుకుమార్‌ కానిస్టేబుల్‌ కావడంతో పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. న్యాయం చేస్తామని ఎస్‌ఐ రమేష్‌బాబు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.  

మరిన్ని వార్తలు