దంపతుల బలవన్మరణం

2 Oct, 2019 11:13 IST|Sakshi
శ్రీనివాసులు, నాగజ్యోతి (ఫైల్‌)

నయం కాని వ్యాధితో జీవితంపై విరక్తి

పురుగుల మందు తాగి బలవన్మరణం

యువతీ.. యువకుడు.. జీవితంపై ఎవరికి వారే కలలుగన్నారు. వారిద్దరినీ తల్లిదండ్రులు దాంపత్య జీవితంతో ఒక్కటి చేశారు. ఏడాదిన్నర కూడా కాలేదు. అంతలోనే అనుకోని వ్యాధి. వారి కలల సౌధాన్ని కూల్చేసింది. భర్త నుంచి భార్యకు వచ్చిందో.. భార్య నుంచి భర్తకు సోకిందో తెలియదు. ఇద్దరినీ కొంతకాలంగా నయం కాని వ్యాధి వెంటాడుతోంది. పలు ఆస్పత్రుల్లో చూపించుకున్నా నయంకాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇద్దరూ బలవన్మరణం చెందారు. వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చి వెళ్లారు.

సాక్షి, రుద్రవరం (కర్నూలు): మండల పరిధిలోని నక్కలదిన్నె గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నాగలక్షమ్మ కుమారుడు శ్రీనివాసులు(26)కు కోవెలకుంట్లకు చెందిన కుమ్మరి నాగయ్య, సుబ్బలక్షమ్మ కుమార్తె నాగజ్యోతి(22)కి గత ఏడాది మే 1న వివాహమైంది. శ్రీనివాసులు హైదరాబాదులో విద్య పూర్తి చేసి, అక్కడే గ్యాస్‌ గోడౌన్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం వెతుక్కోవడంతో పెళ్లి అనంతరం భార్యను అక్కడికే తీసుకెళ్లాడు. భార్య, భర్త ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఏడాది కూడా పూర్తిగాక ముందే ఇద్దరూ అనారోగ్యం బారిన పడ్డారు. డాక్టర్లకు చూపించగా నయం కాని వ్యాధి సోకిందని నిర్ధారించారు. దీంతో హైదరాబాద్‌ నుంచి ఐదు నెలల క్రితం కోవెలకుంట్లకు చేరుకున్నారు. నంద్యాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేయించుకునేవారు.

అయినా తగ్గకపోవడంతో సోమవారం సాయంత్రం కోవెలకుంట్ల నుంచి నక్కలదిన్నెకు చేరుకున్నారు. రాత్రి భోజనం అనంతరం శ్రీనివాసులు తల్లిదండ్రులకు శీతలపానీయం ఇచ్చారు. ఆతర్వాత భార్య, భర్త పురుగుల మందు కలిపిన శీతల పానీయం తాగారు. కొంతసేపటికి నాగజ్యోతి వాంతులు చేసుకుంటూ, కేకలు వేస్తూ బయటకు పరుగెత్తి అత్తమామలను లేపి విషం తాగిన విషయం చెప్పింది. వెంటనే ఆటోలో ఇద్దరిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాలకు 108 వాహనంలో తరలించారు. అక్కడ కోలుకోలేక మృతిచెందారు. నాగజ్యోతి తల్లి సుబ్బలక్షమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విష్ణునారాయణ తెలిపారు.

మరిన్ని వార్తలు