క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

20 Apr, 2018 12:08 IST|Sakshi
బెట్టింగ్‌ ముఠా సభ్యుల వివరాలు వెల్లడిస్తున్న దక్షిణ మండలం డీఎస్పీ నారాయణరావు

రూ.1.30 లక్షల స్వాధీనం

పరారీలో ఎనిమిది మంది నిందితులు

రాజమహేంద్రవరం క్రైం : క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను రాజమహేంద్రవరం టూ టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజకుమారికి వచ్చిన సమాచారం మేరకు అడిషనల్‌ ఎస్పీ రజనీకాంత్‌ రెడ్డి పర్యవేక్షణలో సౌత్‌ జోన్‌ డీఎస్పీ పురేటి నారాయణ రావు సమక్షంలో టూ టౌన్‌ సీఐ ముక్తేశ్వరరావు, ఎస్సైలు కె.నాగరాజు, నాగబాబు దాడులు నిర్వహించి నిందితులను అరెస్ట్‌ చేశారు.

గురువారం రాజమహేంద్రవరం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ మండలం డీఎస్పీ పి.నారాయణ రావు బెట్టింగ్‌ ముఠా వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఐపీఎల్‌ 11వ సీజన్‌లో రాజస్ధాన్‌ రాయల్, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు సంబంధించి క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు.

రాజమహేంద్రవరం ఆల్‌కట్‌ తోట కన్నమాంబా వారి వీధిలో చింతా కనకరత్నం అనే మహిళకు చెందిన ఇల్లును అద్దెకు తీసుకొని ఆమె చెల్లెల కుమారుడు చింతా జాన్‌పాల్‌ అనే వ్యక్తి క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ బెట్టింగ్‌ ముఠాలో సభ్యులు ఆల్‌కట్‌ తోటకు చెందిన చింతా జాన్‌ పాల్, నీలపు దామోదరరావు, సావాడ ప్రసాద్‌ రెడ్డి, లంకె చిరంజీవి, సీరాపు పాపారావు, మద్ది దుర్గారావులను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు.

వీరి వద్ద నుంచి రూ.1.30 లక్షల నగదు, వీడియోకాన్‌ టీవీ, సెటప్‌ బాక్స్, రెండు మొబైల్‌ ఫోన్‌లు, స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం 14 మంది ఉన్నారని తెలిపారు. వారిలో ఆరుగురిని అరెస్ట్‌ చేశామని, మిగిలిన ఎనిమిది మందిని అరెస్ట్‌ చేయాల్సి ఉందని తెలిపారు. నిందితులు రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం, కొవ్వూరు ప్రాంతాలకు చెందిన వారని తెలిపారు. 

క్రికెట్‌ బెట్టింగ్‌పై నిరంతర నిఘా..

క్రికెట్‌ బెట్టింగ్‌పై నిరంతర నిఘా ఉందని, రాజమహేంద్రవరంలో ఈ సీజన్‌లో నాలుగు కేసులు పట్టుకున్నట్టు వివరించారు. కడియం మండలంలో ఒక క్రికెట్‌ ముఠాను పట్టుకొని వారి వద్ద నుంచి రూ.నాలుగు లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్, వన్‌టౌన్‌ పరిధిలో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాలను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. అరెస్ట్‌ చేసిన నిందితులను రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టూ టౌన్‌ సీఐ ముక్తేశ్వరరావు, ఎస్సైలు కె. నాగరాజు, నాగబాబు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు