‘రియల్‌’ దగా!

28 Feb, 2019 06:13 IST|Sakshi

నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్‌

ఇంజినీర్‌కు రూ.47 లక్షలు టోకరా

ఇన్‌స్ట్రాగామ్‌ యాప్‌లో పరిచయమైన సైబర్‌ నేరగాడు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌

సాక్షి, సిటీబ్యూరో: సిటీకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన సైబర్‌ నేరగాడు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో ఎర వేశాడు. ఇండియాతో పాటు మలేషియాలోనూ చేద్దామంటూ బుట్టలో వేసుకున్నాడు. అతడి నుంచి రూ.47 లక్షలు వసూలు చేసి నిండా ముంచాడు. ఎట్టకేలకు తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు బుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఒడిశాకు చెందిన వర్షిణి బేగంపేటలో  ఉంటూ ఓ మల్టీ నేషనల్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమెకు రెండు నెలల క్రితం ఇన్‌స్ట్రాగామ్‌లో జాన్‌ హన్నన్‌ అని చెప్పుకున్న వ్యక్తి పరిచయమయ్యాడు. తాను అమెరికన్‌ ఆర్మీలో అధికారిగా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లు మామూలుగానే చాటింగ్‌ చేసిన తర్వాత అసలు కథ మొదలెట్టాడు. తాను త్వరలో మలేషియా, ఇండియాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలనే ప్రణాళికతో ఉన్నట్లు తెలిపాడు.

తక్కువ కాలంలోనే భారీ లాభాలు పొందే మార్కెట్‌ ఈ రెండు చోట్లా ఉందంటూ నమ్మించాడు. భారత్‌లోని మెట్రోల్లో హైదరాబాద్‌ రియల్‌ మార్కెట్‌కు పెద్ద కేంద్రంగా ఉందని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇద్దరం భాగస్వాములుగా చేరి వ్యాపారం సాగిద్దామని, అందుకు అవసరమైన పెట్టుబడి తానే సమకూరుస్తానని చెప్పడంతో ఆమె పూర్తిగా నమ్మేసింది. ఈ మొత్తాన్ని తాను మలేషియా బ్యాంక్‌ నుంచి రుణంగా తీసుకుంటానని చెప్పాడు. అయితే భారీ మొత్తం ఒకేసారి నీ బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తే అనేక సమస్యలు వస్తాయంటూ చెప్పిన అతగాడు కొద్దికొద్దిగా బదిలీ చేయడానికి ఏర్పాట్లు చేశానన్నాడు. ఈ ఫార్మాలిటీస్‌ కోసం బ్యాంకు ప్రతినిధులు సంప్రదిస్తారని, వారు కోరిన పత్రాలు, ట్యాక్స్‌లు చెల్లించాలని సూచించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు వర్షిణికి మలేషియా బ్యాంక్‌ ప్రతినిధిని అంటూ ఓ వ్యక్తి కాల్‌ చేశాడు. డబ్బు మీ బ్యాంకు ఖాతాలోకి రావాలంటే కొన్ని పద్దతులు ఉంటాయని చెప్పాడు.

ఇందుకు ఆమె అంగీకరించడంతో కొన్ని రకాలైన సర్టిఫికెట్లు కావాలంటూ సూచించాడు. అవి తన వద్ద లేవని వర్షిణి చెప్పడంతో తానే ఏర్పాటు చేస్తానని, తాను కోరినప్పుడు ఆ మొత్తం బ్యాంకులో వేయాలని సూచించాడు. ఇలా వివిధ రకాలైన సర్టిఫికెట్లు, పన్నుల పేరుతో ఆమె ద్వారా రూ.47 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేయించుకుని కాజేశాడు. రెండు నెలల తర్వాత తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ అధికారులకు ఫిర్యాదు చేసింది. అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌ రామ్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. ఇది నైజీరియన్లు చేసిన మోసంగా భావిస్తున్న దర్యాప్తు అధికారులు సాంకేతికంగా ముందుకు వెళ్తున్నారు. నిందితుడు వాడిన ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతా, బాధితురాలు డబ్బు చెల్లించిన బ్యాంక్‌ ఖాతాల వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

మరిన్ని వార్తలు