మురికి కాలువలో పడ్డ బస్సు..29 మంది మృతి

8 Jul, 2019 08:00 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీ బయల్దేరిన స్లీపర్‌ కోచ్‌ బస్సు ఆగ్రా సమీపంలో మురికి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో 29 మంది మృతి చెందగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. లక్నో నుంచి ఢిల్లీకి బయల్దేరిన యూపీ రోడ్‌వేస్‌ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్‌వే వద్దకు రాగానే ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలిస్తున్నారు.

కాగా ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సంతాపం వ్యక్తం చేశారు. మృతులు, గాయపడిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక యూపీ రవాణాశాఖ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

మరిన్ని వార్తలు