ఓ తల్లి.. ఓ గ్రాడ్యుయేట్‌.. సుపారీ కిల్లర్స్‌..!

27 Mar, 2018 08:01 IST|Sakshi

ఏడుగురు సంతానమున్న గృహిణి.. ఓ సైన్స్‌ గ్రాడ్యుయేట్, ప్రాపర్టీ డీలర్, ఒక నిరుద్యోగి, ఓ ఫిజియో థెరపిస్ట్‌...వైవిధ్య నేపథ్యమున్న వీరంతా ఎవరు ? ఏదైనా గొప్ప పని చేసి రికార్డ్‌ సృష్టించారని అనుకుంటున్నారా ? ఈ జాబితాలోని వారంతా కూడా కాంట్రాక్ట్‌ కిల్లర్స్‌ ! డబ్బిస్తే చాలు పిస్తోల్‌ ట్రిగ్గర్‌ నొక్కేందుకు, విషం ఇంజెక్షన్‌ ఇచ్చేందుకు, కత్తులు,ఇతర మారణాయుధాలు ఝుళిపించేందుకు వెనుకాడని హంతకులు.

గతేడాది 50 కేసుల ఛేదన..
దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క 2017 సంవత్సరంలోనే తక్కువలో తక్కువ 50 కాంట్రాక్ట్‌ హత్య కేసులను అక్కడి పోలీసులు ఛేదించారు. ఈ హంతకుల్లో కొంత మందికి ఎలాంటి నేర చరిత్ర లేదు. ఇందులో కొందరైతే మొదటిసారి నేరం చేసిన వారు. ఈ కాంట్రాక్ట్‌ హత్యల కోసం సుపారీగా తక్కువలో తక్కువగా రూ. 40 వేల వరకు కూడా ఇచ్చినట్టు వెల్లడైంది. ఈ హత్యలకు ఒక పద్ధతి లేదా ఒక విధానం అంటూ లేదు.కానీ ఢిల్లీ మహానగరంలో  బతుకు వెళ్లదీసేందుకు అవసరమయ్యే పైకం కోసం హత్య, ఇతర నేరాలకు సిద్ధమవుతున్నట్టు తేలింది.ఢిల్లీ కాంట్రాక్ట్‌ కిల్లర్లలో ఎక్కువశాతం  ఉత్తరప్రదేశ్, బిహార్‌ గ్రామాలకు చెందినవారే. దేశ వాణిజ్య రాజధాని ముంబై మొదలుకుని ఇతర నగరాల్లో  కాంట్రాక్ట్‌ హత్యల ముఠాలు పెద్దసంఖ్యలోనే ఉన్నాయి.  ఢిల్లీలో మాత్రం వ్యవస్థీకృత  కాంట్రాక్ట్‌ కిల్లర్లు లేరు. 

రూ. 4 కోట్ల సుపారీ...
ఢిల్లీ పోలీస్‌ రికార్డుల ప్రకారం...గతేడాది ఫిబ్రవరిలో  కాంట్రాక్ట్‌ హత్యల్లో అత్యధికంగా  రూ. 4 కోట్ల మొత్తానికి సుశీల్, అమిత్, సునీల్, రమేశ్‌ (ఒక్కోక్కరికి కోటి చొప్పున) ఒప్పందం కుదిరింది. హరియాణాకు చెందిన సందీప్‌ బద్‌సావనియా అనే గ్యాంగ్‌స్టర్‌ హత్యకు అతడి ప్రత్యర్థి రామ్‌ కరణ్‌ ఈ మేరకు పథకం రచించాడు. గ్యాంగ్‌వార్‌లో భాగంగా ఇదో హైప్రొఫైల్‌ కాంట్రాక్ట్‌ హత్యగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఈ హత్యలో నలభైమంది పాలుపంచుకున్నారు. కొన్నినెలల పాటు బద్‌సావనియా కదలికలను  గమనించారు. సెల్‌ఫోన్‌ కాల్‌డేటా రికార్డు, అనుపానులు  తెలుసుకునేందుకు ప్రైవేట్‌ గూఢచారుల సేవలు ఉపయోగించుకున్నారు. హత్య చేశాక మృతదేహాన్ని 400 కి.మీ అవతల పడేసి వచ్చారు. ప్రధాన హంతకులు నలుగురు 2016–17 మధ్యకాలంలో 9 హత్యలు చేసినట్టు బయటపడింది. 

చిన్న కారణాలకూ హత్యలు...
గ్యాంగ్‌లపై ఆధిపత్యం కోసం జరిగిన హత్యలకు భిన్నంగా, ఢిల్లీలో ఈర్ష్య, అసూయ, ఆస్తి వివాదం, పెళ్లి పెటాకులు కావడం మొదలు చిన్న చిన్న కారణాలకు కూడా కాంట్రాక్ట్‌హత్యలు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. 1973లో విడాకుల కారణంగా  నరేంద్రసింగ్‌ జైన్‌ అనే కంటి డాక్టర్‌ తన భార్య విద్యాజైన్‌ హత్యకు రూ. 25 వేల కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నాడు. ఢిల్లీలో జరిగిన తొలి  కాంట్రాక్ట్‌ హత్యల్లో ఒకటిగా దీనిని పరిగణిస్తున్నారు. 1977లో నరేంద్రసింగ్‌కు శిక్ష పడింది. గతేడాది నవంబర్‌లో తన భర్త హత్యకు బరేలికి చెందిన అబ్దుల్‌ మున్నార్‌కు ఓ యువతి కాంట్రాక్ట్‌నిచ్చింది. తనకిస్తానన్న రూ. 5 లక్షల్లో కేవలం రూ. 50 వేలే అందడంతో  షార్ప్‌షూటర్‌గా పేరుపొందిన మున్నార్‌  కాలిపై మాత్రమే కాల్పులు జరిపాడు. హత్యకు ముందే కాంట్రాక్ట్‌ మొత్తం డబ్బు పొందేందుకు వేచిచూస్తున్న అతడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. మర్డర్‌ కాంట్రాక్ట్‌లో రికార్డున్న మున్నార్, 10,15 పర్యాయాలు జైలుకెళ్లి అక్కడ అనేక మందిని మిత్రులు చేసుకున్నాడు. ఒకరి హత్యకు జైల్లో ఉన్న ఓ ఐఏఎస్‌ అధికారి ద్వారా కాంట్రాక్ట్‌ తీసుకున్నందుకు 2015లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

కాంట్రాక్ట్‌ కిల్లర్‌గా ఫిజియో థెరపిస్ట్‌...
ప్రేంకుమార్‌ అనే నిరుద్యోగ  ఫిజియో థెరిపిస్ట్‌ తన పెళ్లి ఖర్చు కోసం రూ.5 లక్షలకు ఓ హత్యా కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నాడు. ఈ హత్య కోసం విషపూరితమైన రెండు ఇంజక్షన్లు ఉపయోగించాడు. తూర్పు ఢిల్లీ కోండ్లిలో ఓ పాలవ్యాపారి హత్యకు అతడి భార్య రూ. 40 వేలకు కాంట్రాక్ట్‌ ఇచ్చింది. అక్కడి పాదరక్షల ఫ్యాక్టరీలో పనిచేసే ప్రమోద్‌కుమార్, వివేక్‌కుమార్‌ ఈ హత్య చేశారు. ఇది వారి మొదటి నేరం. నోయిడాలోని ఓ హోటల్‌ యజమాని హత్యకు పథకం పన్నిన 8 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిలో ప్రాపర్టీ డీలర్లు మొదలుకుని జిమ్‌ ట్రైనర్ల వరకున్నారు. ఏడుగురు సంతానమున్న బసిరన్‌ అనే 62 ఏళ్ల  మహిళ రూ. 60 వేలకు హత్యా కాంట్రాక్ట్‌ తీసుకుంది. దొంగతనం, హత్య, బలవంతపు వసూళ్లు వంటి నేరాలపై జైలుశిక్ష అనుభవిస్తున్న తన కొడుకుల కోర్టు ఫీజుల కోసం ఆమె రూ. 18 వేలు అట్టే పెట్టుకుంది.  మిగతా డబ్బును ఇద్దరు నిరుద్యోగులకిచ్చి హత్య చేయాల్సిన వ్యక్తి ముఖం కాల్చేసి శివార్లలోని అడవుల్లో పూడ్చేయాలని ఆదేశించింది. 

కొన్ని ముఖ్యమైన కేసులు...

  • 2017 అక్టోబర్‌లో ఢిల్లీలోని షాదరా మానససరోవర్‌ పార్కులో నలుగురు మహిళలు, ఓ సెక్యూరిటీగార్డు హత్యకు ఇద్దరు కాంట్రాక్ట్‌ కిల్లర్లకు రూ. 2 లక్షల చొప్పున చెల్లింపు. వీరిపై 3 దొంగతనం కేసులున్నాయి.
  • 2017 జూన్‌లో అండర్‌వరల్డ్‌ డాన్‌ ఛోటారాజన్‌ హత్యకు అతడి పాలవాడి కొడుకు జునైద్‌ చౌదరికి రూ. 1.5 లక్షలకు కాంట్రాక్ట్‌. అయితే ఈ నేరం చేయక  ముందే అతడిని అరెస్ట్‌చేశారు. జునైద్‌పైనా రెండు కేసులున్నాయి.
  • 2017 మేలో బీఎస్‌పీ నేత చౌదరి మునవ్వర్‌ హసన్, భార్య, 4 పిల్లల హత్యకు రూ.3 లక్షలకు మునవ్వర్‌ స్నేహితుడు కాంట్రాక్ట్‌ ఇచ్చాడు.   ఈ పనిని  ఫిరోజ్, జుల్ఫీకర్‌ అనే నిరుద్యోగ యువకులకు అప్పగించాడు. వీరిపైనా కేసులున్నాయి.
  • 2016 మేలో న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ లీగల్‌ అఫీసర్‌ ఎంఎంఖాన్‌ను ఆయన ఇంటి బయటే కాల్చిచంపారు. ఈ హత్యకు  ఢిల్లీకి చెందిన హోటల్‌ యజమాని రూ.3.5 లక్షలకు ఇజ్రాయిల్, సలీంఖాన్, అమిర్‌ అల్వి, అన్వర్‌ ఒవైస్‌ అనే యువకులకు కాంట్రాక్ట్‌ ఇచ్చాడు. 

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా