Suspected ISIS Terrorist Arrest: ఢిల్లీలో మోస్ట్‌ వాంటెడ్‌ ఐసిస్‌ ఉగ్రవాది అరెస్ట్

2 Oct, 2023 11:10 IST|Sakshi

న్యూడిల్లీ: దేశ రాజధాని  ఢిల్లీలో అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐసిస్‌ టెర్రరిస్ట్‌ మహమ్మద్‌ షానవాజ్ అలియాస్ సైఫీ ఉజామాతోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం సోమవారం అరెస్టు చేసింది. కాగా సైఫీ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లిస్ట్‌లో ఉన్నారు. అతని వివరాలు వెల్లడించిన వారికి మూడు లక్షల రివార్డు కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

అనుమానిత ఉగ్రవాదులు దేశ రాజధానిలో ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు పక్కా సమాచారం రావడంతో ఇతడిని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన షానవాజ్‌ పూణె ఐసిస్‌ మాడ్యుల్‌ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఇతడు ఢిల్లీకి చెందిన వాడు కాగా పూణె పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఢిల్లీలో తలదాచుకున్నట్లు తెలియడంతో చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు. 

వీరి నుంచి ఐఈడీ తయారీకి ఉపయోగించే ద్రవ రసాయనంతో సహా పలు పేలుడు సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్‌ అనుమానితులుగా అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులతో కలిసి షానవాజ్‌ను ప్రస్తతం పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఐసిస్ ఉగ్రవాదుల గురించి మరిన్ని విషయాలు తెలియనున్నాయి. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. 

కాగా దేశంలోని అనేక టెర్రర్ మాడ్యూల్స్‌ను అణిచివేసేందుకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఎన్ఐఏ అధికారులతో కలిసి పనిచేస్తోంది. షానవాజ్‌తో పాటు మరో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులైన రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీ, అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డయాపర్‌వాలా, తల్హా లియాకత్ ఖాన్ గురించి సమాచారం ఇస్తే ఒక్కొక్కరికి రూ.3 లక్షల నగదు బహుమతిని ఇటీవలె ఎన్‌ఐఏ ప్రకటించింది.  మహారాష్ట్రలోని పూణెలో ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌కు చెందిన మాడ్యూల్‌తో ఈ నలుగురికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
చదవండి: భారత్‌లో అఫ్గాన్‌ ఎంబసీ మూసివేత

మరిన్ని వార్తలు