చైనా నుంచి నిధులు.. ఢిల్లీలో న్యూస్‌క్లిక్‌ జర్నలిస్టుల నివాసాల్లో సోదాలు

3 Oct, 2023 13:33 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పలువురు జర్నలిస్టుల నివాసాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. ప్రముఖ మీడియా పోర్టల్‌ ‘న్యూస్‌క్లిక్‌’కు సంబంధించిన జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీ పోలీస్‌ ప్రత్యేక విభాగం తనిఖీలు చేపట్టింది. ఏకకాలంలో ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లోని 100 చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహిస్తోంది. న్యూస్‌క్లిక్‌ సంస్థకు చైనా నుంచి అక్రమంగా నిధులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు  జరుపుతోంది.

ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు సీజ్‌..
ఈ దాడుల్లో జర్నలిస్టులు, ఉగ్యోగులకు సంబంధించిన ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) అందించిన సమాచారం ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు చీఫ్‌ ఎడిటర్‌ ప్రబీర్ పుర్కాయస్థతో సహా తమంది జర్నలిస్టులను లోధీ రోడ్‌లోని స్పెషల్ సెల్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు తెలిపారు.

భారీగా విదేశీ నిధులు
ఇక న్యూస్ క్లిక్ సంస్థ మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే రూ. 38.05 కోట్ల విదేశీ నిధులను మోసగించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ద్వారా రూ. 9.59 కోట్లు, సేవల ఎగుమతి ద్వారా రూ. 28.46 కోట్లు విదేశీ రెమిటెన్స్‌ వచ్చినట్లు  గుర్తించినట్లు తేలింది. అలా వచ్చిన నిధులను గౌతమ్ నవ్లాఖా, హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ సహా పలువురు వివాదాస్పద జర్నలిస్టులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించిందని ఈడీ ఆరోపించింది.

సీతారాం ఏచూరి నివాసంలోనూ సోదాలు..
న్యూస్‌క్లిక్‌కు సంబంధించి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధికారిక నివాసంలో కూడా ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు. సీపీఎం ఉద్యోగి శ్రీనారాయణ్‌ ఇంటిపై తనిఖీలు చేపట్టింది. కాగా నారాయణ్‌ కొడుకు న్యూస్‌ క్లిక్‌లో పనిచేస్తున్నాడు. అయితే సీపీఎం అధికార నివాసాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేరిట కేటాయించారు. తన నివాసంలో జరిగిన దాడులపై ఏచూరి స్పందించారు.
చదవండి: 'సనాతన ధర్మం మాత్రమే మతం.. మిగిలినవన్నీ..'

మీడియా నోరు నొక్కేందుకే..?
పోలీసులు తన నివాసానికి వచ్చారని, అక్కడ తనతోపాటు నివసిస్తున్న సహచరుడి కుమారుడు న్యూస్‌క్లిక్‌లో పనిచేస్తున్నాడని తెలిపారు. అతడిని విచారించేందుకు పోలీసులు వచ్చినట్లు చెప్పారు. అతని ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను తీసుకున్నారని అయితే పోలీసులు ఏ కేసులో ఈ  దర్యాప్తు చేస్తున్నారో తనకు తెలియదని పేర్కొన్నారు. ఒకవేళ ఇది మీడియా నోరును నొక్కేందుకు జరుగుతున్న ప్రయత్నమైతే.. దీని వెనకున్న కారణాన్ని దేశమంతా తెలుసుకోవాలని అన్నారు.

తప్పు చేస్తే దర్యాప్తు చేస్తారు: కేంద్రమంత్రి
ఢిల్లీ పోలీసుల సోదాలపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందిస్తూ..  దీనిని సమర్థించాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దర్యాప్తు సంస్థలు నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం విచారించే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. మరోవైపు న్యూస్‌క్లిక్‌తో సంబంధం ఉన్న జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేపట్టడంపై  ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
చదవండి: ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. 24 గంటల్లో 24 మంది మృతి

చైనా నుంచి నిధులు
న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి నిధులు అందుతున్నట్టుగా ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో కూడా ఈ మీడియా సంస్థకు చెందిన కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరిపింది. ఈ క్రమంలో న్యూస్‌ క్లిక్‌ సంస్థకు చెందిన కొంతమంది ఉద్యోగులు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు అనుమానిస్తూ.. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(UAPA) కింద సదరు సంస్థపై ఆగస్టు 17న కేసు నమోదైంది. దీని ఆధారంగానే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

కాగా , చైనా అనుకూల ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులను పొందిన గ్లోబల్ నెట్‌వర్క్‌లో ఈ సంస్థ కూడా భాగమని న్యూయార్క్ టైమ్స్ గతంలో పేర్కొంది. ఈ ఆరోపణలు న్యూస్‌క్లిక్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పరిశోధనలు, చర్యలకు మరింత ఊతమిచ్చాయి.

మరిన్ని వార్తలు