బురారీ కేసులో 12వ వ్యక్తి??

5 Jul, 2018 09:54 IST|Sakshi

సామూహిక మరణాల కేసు(బురారీ కేసు) దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొత్త అనుమానాలు వ్యక్తం కావటంతో బురారీ కేసును ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. లలిత్‌ భాటియా మభ్యపెట్టడంతోనే కుటుంబ సభ్యులంతా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారన్న కోణం ఒకటి కాగా, ఈ వ్యవహారంలో మరో వ్యక్తి ప్రమేయం ఉండి ఉంటుందన‍్నది రెండో కోణం. అందుకు కారణం ఆత్మహత్యకు ముందు ఇంట్లో పూజలు నిర్వహించినట్లు ఉండటం. (...విచిత్రంగా ప్రవర్తించేవాళ్లు)

సాక్షి, న్యూఢిల్లీ: భాటియా కుటుంబం ఆత్మహత్యకు ముందు ఇంట్లో ‘వటవృక్ష’ పూజ నిర్వహించారు. సాధారణంగా పూజారుల సమక్షంలోనే దీనిని నిర్వహిస్తుంటారు. దీంతో బయటి నుంచి వచ్చిన వ్యక్తే ఈ పూజను నిర్వహించి ఉంటాడని భావిస్తున్నారు. మోక్షం కోసం భగవంతుడ్ని చేరేందుకు దగ్గరి దారి ఇదేనని ప్రలోభానికి గురి చేసి ఉంటారా? అ‍న్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ద్వారం తెరిచి ఉండటంతో సదరు వ్యక్తి పూజ ముగిశాక ఆ మార్గం గుండానే వెళ్లిపోయి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భాటియా కుటుంబం తరచూ ఇటువంటి పూజలు నిర్వహించేదని, కొందరు స్వామీజలు వారి ఇంటికి వచ్చే వారని గతంలో ఇంట్లో పని చేసిన వాళ్లు చెబుతున్నారు. దీంతో 12వ వ్యక్తి మిస్టరీ చేధించే పనిలో పడ్డారు.

మానసిక రుగ్మతే!... 2007లో నారాయణ్ దేవి(77) భర్త మృతి చెందారు. ఆయన మరణాన్ని కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. ముఖ్యంగా లలిత్ భాటియా మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. తండ్రి ఫొటోతో మాట్లాడడం, ఆయన ఆదేశాలు ఇచ్చాడంటూ వాటిని ఓ పుస్తకంలో రాయడం చేస్తుండేవాడు. ‘తండ్రి తన కలలో కనిపించాడని, మాట్లాడాడని, ఆయన ఆత్మ ఆవహించిందని చెబుతూ కుటుంబ సభ్యులను కూడా అదే దారిలో నడిపించాడు. క్రమంగా తన రుగ్మతను కుటుంబ సభ్యులకూ అంటించాడు. ‘అంతిమ సమయంలో మన కోర్కెలు నెరవేరేటప్పుడు ఆకాశం బద్దలవుతుంది.భూమి కంపిస్తుంది. అయినా ఎవరూ భయపడొద్దు. నేనొచ్చి రక్షిస్తా’ పుస్తకాల్లో రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఈ రెండు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు.. వీలైనంత త్వరలో కేసులో చిక్కుముడి విప్పుతామని డీసీపీ వెల్లడించారు. మరోవైపు భాటియా ఇంట్లో దొరికిన నోట్‌ బుక్‌లను విశ్లేషించిన మానసిక నిపుణులు.. వాటిని అధ్యయనం చేసే పనిలో ఉన్నారు. 

సీసీటీవీలో షాకింగ్‌ విజువల్స్‌...

ఆ పైపుల సంగతేంటి?

మరిన్ని వార్తలు