కృపారాణి హత్యపై భిన్న కథనాలు

23 Dec, 2019 10:53 IST|Sakshi
బీచ్‌లో కృపారాణి దిగిన ఫొటో

ఆందోళనలో తల్లిదండ్రులు, పిల్లలు, దళిత సంఘాలు

తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకోలు

పోలీసుల ముమ్మర దర్యాప్తు

కృష్ణాజిల్లా, కలిదిండి (కైకలూరు): కలిదిండి శివారు బరింకలగరువు గ్రామ నివాసి కటికతల కృపారాణి (25) హత్యోదంతంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పోలీసులు మౌనం వీడక పోవడంతో బంధువులు, గ్రామస్తులు, దళిత సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఉప్పుటేరులో శుక్రవారం శవమై తేలిన కృపారాణి హత్యకు గురైందని, నిందితులను పట్టుకుంటామని గుడివాడ డీఎస్పీ ఎన్‌. సత్యానందం ప్రకటించి రెండు రోజులు గడుస్తోంది. శనివారం రాత్రి కృపారాణి మృతదేహాన్ని పోలీసులు అప్పగించగా రాత్రివేళ ఖననం చేశారు. కాగా దీనిపై తల్లిదండ్రులు బుజ్జి, ఏసమ్మను ప్రశ్నించగా వారు కొన్ని వివరాలను అందించారు.

ఆ వివరాల మేరకు.. భర్తకు దూరమైన తర్వాత ఇందిరాకాలనీకి చెందిన అజయ్‌ (30) అనే వివాహితుడితో కృపారాణి సహ జీవనం చేస్తోంది. అతను స్థానిక చికెన్‌ సెంటర్లో పని చేసేవాడు. ఇందిరా కాలనీలో నివసించే అతను భార్యపిల్లలను పట్టించుకోకపోవడంతో వారు విజయవాడ వెళ్లిపోయారు. కృపారాణి కూడా ఇందిరా కాలనీలో అద్దెకు ఉంటూ అతనికి దగ్గరైంది. ఏడాది కాలంగా వీరి పరిచయం కొనసాగింది. రెండు నెలలుగా అజయ్‌కి కృపారాణి దూరంగా ఉంటోంది. అయితే, కృపారాణి అత్తవారి గ్రామమైన కొత్తపల్లిలో అజయ్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఇక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆమె తరచూ కృపారాణికి ఫోన్‌ చేసి అజయ్‌ని వదిలేయక పోతే నిన్ను భూమి మీద లేకుండా చేస్తానని హెచ్చరించేది. కృపారాణి హత్యకు ముందు మూడు రోజుల నాడు అంటే మంగళవారం కూడా కృపారాణి ఇంటికి అజయ్‌ వచ్చాడు. ఆ తర్వాత ఘటన జరగడంతో ఈ హత్యలో అజయ్‌ ప్రమేయం ఉంటుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు కూడా తెలియజేసినట్లు చెప్పారు. 

మృతురాలి పిల్లలు, తల్లిదండ్రులు
పలు అనుమానాలు..

ఇదిలా ఉండగా హత్యకు ముందు రోజు గురువారం సాయంత్రం కృపారాణి ఆటోలో ఏలూరుపాడు బట్టల షాపునకు వెళ్లిందని, అదే రాత్రి హత్యకు గురైందని, తన కుమార్తెను గ్యాంగ్‌ రేప్‌ చేసి, హత్యచేసి ఉంటారని తల్లి ఏసమ్మ ఆరోపించింది. ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ జీవిస్తున్న కృపారాణి దూరం కావడంతో పిల్లలు తట్టుకోలేక పోతున్నారని వాపోయింది. కృపారాణి కొంకేపూడిలో ఉద్యోగం చేస్తోంది. మూడు నెలల క్రితం కుమారుడు శ్యాంబాబు (20) (కృపారాణి తమ్ముడు) అనారోగ్యంతో మృతి చెందగా, పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి (బుజ్జి) ని, తననూ పోషిస్తున్న కృపారాణిని దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారని ఏసమ్మ విలపించింది. ‘హత్య చేయవలసినంత తప్పు కృపారాణి ఏమి చేసిందయ్యా, చిన్నారులకు ఎవరు దిక్కు’ అంటూ కన్నీటి పర్యంతమైంది. కృపారాణి పిల్లలకు, వృద్ధాప్యంలో ఉన్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఏసమ్మ వేడుకుంటోంది. కాగా, కృపారాణి హత్య కేసులో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని కలిదిండి ఎస్‌ఐ జనార్థన్‌ తెలిపారు. అయితే, ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న అజయ్‌ కూడా వీరిలో ఉన్నాడని తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు