మర్డర్‌ కేసు.. మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు

21 Feb, 2020 17:30 IST|Sakshi
అమన్‌ బహదూర్‌ (పాత చిత్రం)

లక్నో: గోమతి నగర్‌లో బీటెక్‌ విద్యార్థిని దారుణంగా హతమార్చిన ఘటనలో బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే షంషేర్‌ బహదూర్‌ కుమారుడి ప్రమేయం ఉన్నట్టు తెలిసింది. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు అమన్‌ బహదూర్‌ సహా మిగతా నిందితుల్ని అరెస్టు చేశారు. వివరాలు.. స్నేహితుడిని కలవడానికి ప్రశాంత్‌ సింగ్‌ (23) అనే ఇంజనీరింగ్‌ విద్యార్థి కారులో గురువారం సాయంత్రం గోమతి నగర్‌కు వెళ్లాడు. అక్కడ అలకనంద అపార్ట్‌మెంట్‌ వద్దకు చేరుకోగానే మాటు వేసిన 20- 25 మంది దుండగులు తొలుత కారు అద్దాలను ధ్వసం చేశారు. అనంతరం ప్రశాంత్‌ ఛాతీలో పలుమార్లు కత్తితో పొడిచి పరార్‌ అయ్యారు.


(చదవండి : బీటెక్‌ విద్యార్థి దారుణ హత్య)

ఈ క్రమంలో కారు దిగిన బాధితుడు అక్కడినుంచి స్నేహితుడి అపార్టుమెంటులోకి పరుగెత్తుకు వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు అపార్టుమెంటు వద్దకు వెళ్లి పరిశీలించగా... ప్రశాంత్‌ సింగ్‌ రక్తపు మడుగులో కనిపించాడు. హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. హత్యోందంతం దృశ్యాలు అపార్ట్‌మెంట్‌ సీసీ కెమెరాలో నమోదవడంతో వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. శుక్రవారం ఉదయం నిందితుల్ని అరెస్టు చేశారు. ఇక బుధవారం రాత్రి జరిగిన గొడవ కారణంగానే ఈ హత్య చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓ బర్త్‌డే పార్టీకి హాజరైన ప్రశాంత్‌.. అక్కడ తన జూనియర్‌తో గొడవ పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

మరిన్ని వార్తలు