ఫేక్‌ పోలీస్‌!

11 Jun, 2018 11:44 IST|Sakshi

పోలీసుల్లా బెదరగొట్టి..బురిడీ కొట్టి

మహిళలను ఏమార్చి నగలు దోపిడీ

నకిలీలపై దృష్టి సారించని పోలీసులు

ఒంటరి మహిళల లక్ష్యంగా నగలు దోచుకెళ్తున్న దుండగులు పంథా మార్చారు. పోలీసుల్లా తనిఖీలు చేపడుతున్నట్లు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు నటిస్తూ ఒంటరిగా వెళ్లే మహిళలు, వృద్ధుల వద్ద నగలు దోచుకెళ్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. నకిలీ పోలీసుల దోపిడీ ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నా.. అసలు పోలీసులు దృష్టి సారించకపోవడంతో వారు చెలరేగిపోతున్నారు. పట్టణంలో నెల వ్యవధిలో నకిలీ పోలీసులు ఇద్దరు మహిళలను ఏమార్చి 18 సవర్ల నగలు దోచుకెళ్లారు.

గూడూరు: పథకం ప్రకారం సినీ ఫక్కీలో ఇద్దరు..ముగ్గురు వ్యక్తుల ముఠా జన సంచారం తక్కువగా ఉండ ప్రాంతాలను ఎంచుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. పోలీసుల్లా నటిస్తూ నగలు దండిగా వేసుకుని వెళ్లే ఒంటరి మహిళను లక్ష్యంగా చేసుకుని నగలు దోచుకెళ్తున్నారు. డక్కిలి మండలం దగ్గవోలు గ్రామానికి చెందిన ఇస్కపల్లి వసంతమ్మ అనే అంగనవాడీ కార్యకర్త స్టేట్‌ బ్యాంక్‌లో పనిమీద ఈ ఏడాది మార్చి 13వ తేదీన గూడూరుకు వచ్చింది. తన పని పూర్తయ్యాక ఆమె తిరిగి పాత బస్టాండ్‌కు నడుచుకుంటూ వస్తుండగా, రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత ముత్యాలపేట మలుపు సమీపంలో ఓ వ్యక్తి ఏమ్మా.. నిన్ను పోలీస్‌ సార్‌ పిలుస్తున్నాడు.. లెక్కలేకుండా వెళ్తున్నావే అని కేకేసి చెప్పాడు. దీంతో వెనుదిరిగి చూసిన వసంతమ్మ ఏంటని ప్రశ్నించగా పోలీస్‌ సార్‌ పిలుస్తున్నారమ్మా అంటూ బాగా పొడుగ్గా బుర్ర మీసాలతో నుదుటన బొట్టు పెట్టుకుని ఉన్న ఓ వ్యక్తిని చూపించాడు. ఆయన వాలకం చూసిన వసంతమ్మ ఆయన్ను పోలీసే అనుకుంది.

అంతలోనే ఆ డ్రామాలో రెండో పాత్ర పోషిస్తున్న మరో (దొంగ) వ్యక్తి మెడలో చైను, ఉంగరాలతో అటుగా వెళ్తున్నాడు. అతన్ని ఆపి పోలీస్‌లా నటిస్తున్న వ్యక్తి ఏంరా మెడలో చైన్, ఉంగరాలు వేసుకుని భయం లేకుండా తిరుగుతున్నావే.. ఎవడోకడు కొట్టి నీ ఒంటి మీద ఉన్నవి మొత్తం గొరిగేస్తారు.. తీసి జాగ్రత్తగా దాచుకో అంటూ హెచ్చరించాడు. దీంతో ఆ వ్యక్తి అలాగే సార్‌.. అంటూ భయాన్ని నటిస్తూ తన మెడలోని చైన్‌తో పాటు, ఉంగరాలు కూడా తీసి కాగితంలో పొట్లాం కట్టి తన జేబులో వేసుకుని వెళ్లిపోయాడు. అది చూసిన వసంతమ్మ  ఆయన నిజమైన పోలీసే అనుకుంది. ఇదే అదనుగా పోలీస్‌లా ప్రవర్తిస్తున్న వ్యక్తి ఆ బంగారం తీసివ్వమ్మా అని చెప్పడంతో వసంతమ్మ తన మెడలో ఉన్న నాలుగన్నర సవర్ల బంగారు సరుడుతో పాటు, 4 సవర్ల రెండు గాజులు, ఒకటన్నర సవర్ల రెండు ఉంగరాలు తీసి ఆయన చేతికిచ్చింది. ఆయన తన వద్ద ఉన్న కాగితంలో ఆ బంగారు ఆభరణాలను చుట్టి, వాటిని ఆమె హ్యాండ్‌ బ్యాగ్‌లో వేసే క్రమంలో ఆమె కళ్లు కప్పి వాటికి బదులుగా రాళ్లు ఉంచిన పొట్లాన్ని ఆమె బ్యాగులో వేశాడు. వసంతమ్మ పాత బస్టాండ్‌ వద్దకు చేరుకుని తన ఊరికెళ్లే బస్సులో ఎక్కి బ్యాగులో చూసుకోగా అందులో ఆ ప్యాకెట్‌  ఏమీ కనిపించలేదు.

దీంతో తాను మోసపోయానని లబోదిబో మంటూ ముత్యాలపేట అంతా గాలించింది. చివరికి 1వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  తాజాగా అదే తరహాలో స్థానిక ఐసీఎస్‌ రోడ్డు ప్రాంతంలోని మైథిలి ఆస్పత్రి కూడలి ప్రాంతం వద్ద శనివారం మధ్యాహ్నం వృద్ధురాలి వద్ద నుంచి ఎనిమిది సవర్లు నగలు కాజేసిన విషయం తెలిసిందే. వాములమిట్ట ప్రాంతానికి చెందిన దువ్వూరు ఈశ్వరమ్మ అనే వృద్ధ మహిళ మార్కెట్‌ ఇంటికి వెళ్తున్న క్రమంలో ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు సార్‌ పిలుస్తారమ్మా అనడంతో ఆమె వెనక్కు తిరిగి చూడగా, అక్కడున్న వ్యక్తి పోలీస్‌లా వ్యవహరించి.  ఏమ్మా గొంతులు కోసి నగలు దోచుకెళ్లే వారు తిరుగుతుంటే బంగారం వేసుకుని ఒంటరిగా వెళుతున్నావే.. భయం లేదా అంటూనే అవి తీసి ఈ కాగితంలో పొట్లాం కట్టుకుని వెళ్లు అని చెప్పాడు. ఇలా ఆమె వద్ద నుంచి నగలు తీసుకుని పొట్లాం కట్టి ఇస్తామని తీసుకుని రాళ్లున్న పొట్లాం ఇచ్చి పంపారు. కొంచెం దూరం వెళ్లి పొట్లాం విప్పి చూసుకుని మోసపోయినట్లు గ్రహించిన ఈశ్వరమ్మ 1వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

మరిన్ని వార్తలు