ఫైనాన్స్‌ వ్యాపారి దారుణ హత్య

28 Nov, 2019 09:17 IST|Sakshi

తునిలో సంచలనం సృష్టించిన ఘటన

మామను చంపిన అల్లుడు

పరారీలో నిందితుడు మారెడ్డి

తుని: కుటుంబ పోషణ కోసం ఇద్దరు ఫైనాన్స్‌ వ్యాపారం ప్రారంభించారు. అనూహ్యంగా ఆదాయం వచ్చింది. ఇద్దరు మధ్య ఆర్థికపరమైన మనస్పర్థలు వచ్చాయి. కట్‌ చేస్తే వరుసకు మామైన నల్లమిల్లి రాజారెడ్డి(59)ని అల్లుడు మారెడ్డి దారుణంగా హత్య చేశాడు. బుధవారం జరిగిన సంఘటనకు సంబంధించి పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, తుని పట్టణ సీఐ రమేష్‌బాబు కథనం ఇలా.. రాయవరం మండలం పుసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి రాజారెడ్డి, కర్రి మారెడ్డిలు 2006లో ఫైనాన్స్‌ వ్యాపారం చేపట్టారు. తుని పట్టణం సీతారాంపురంలో ఇంటిని అద్దెకు తీసుకుని పరిసర ప్రాంతాల్లో వ్యాపారం చేస్తున్నారు. అప్పట్లో మారెడ్డి వ్యాపారంలో రూ.ఆరు లక్షలు పెట్టుబడి పెట్టాడు. 2014 వరకు వ్యాపారం సజావుగా సాగింది. ప్రతి సోమవారం తుని వచ్చి రెండు రోజుల పాటు వసూళ్లు చేసుకుని సొంత ఊళ్లకు వెళ్లేవారు. రాజారెడ్డి కుటుంబం విశాఖ జిల్లా విశాఖపట్టణంలో ఉంటున్నారు. మారెడ్డి పసలపూడిలో ఉంటున్నారు.

అకౌంట్‌ విషయంలో వివాదం మొదలైంది. రాజారెడ్డి అకౌంట్‌ను చూసేవారు. ఉమ్మడి వ్యాపారంలో రూ.11 లక్షలు తేడా వచ్చింది. ఇదే విషయాన్ని మారెడ్డి తరచూ రాజారెడ్డిని ప్రశ్నించారు. తొందరలోనే సెటిల్‌ చేస్తానని చెప్పాడు. ఐదు నెలలుగా ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. సోమవారం రాజారెడ్డి, మారెడ్డితో పాటు రాజారెడ్డి మేనల్లుడు హరినాథ్‌రెడ్డి తుని పట్టణంలోని సీతారాంపురం అద్దె ఇంటికి వచ్చారు. మంగళవారం లైన్‌కు వెళ్లి కలెక్షన్‌ చేసుకుని సాయంత్రం గదికి వచ్చారు. హరినాథ్‌రెడ్డి బయటకు వెళ్లి ముగ్గురికి టిఫిన్‌ తీసుకువచ్చాడు. అనంతరం రాజారెడ్డి, హరినాథ్‌రెడ్డి ఒక గదిలో, మారెడ్డి వేరే గదిలో పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో మారెడ్డి రాజారెడ్డి పడుకున్న గదిలోకి వెళ్లాడు. నిద్రలో ఉన్న రాజారెడ్డి తలపై ఇనుప రోడ్డుతో కొట్టాడు. శబ్ధం రావడంతో హరినాథ్‌రెడ్డి లేచి మారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మారెడ్డి విచక్షణ కోల్పోయి కొట్టడంతో రాజారెడ్డి తలకు తీవ్ర గాయమైంది.

ఇది గమనించిన హరినాథ్‌రెడ్డి కటుంబ సభ్యులకు, వారు 108 అంబులెన్స్‌కు సమచారం ఇచ్చారు. గాయపడిన రాజారెడ్డిని అంబులెన్స్‌లో తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. పట్టణ సీఐ రమేష్‌బాబు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాతే హత్యకు దారి తీసిన పరి«స్థితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. హత్యకు ప్రత్యక్ష సాక్షి హరినాథ్‌రెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.  

మరిన్ని వార్తలు