విద్యుదాఘాతంతో భారీ అగ్ని ప్రమాదం

6 Mar, 2018 10:42 IST|Sakshi
శీతనపల్లిలో పూర్తిగా కాలిపోయిన ఇళ్లు..ఇన్‌సెట్‌లో(తీవ్రంగా గాయపడిన గేదె)

మూడిళ్లు దగ్ధం

రూ.10 లక్షల ఆస్తి నష్టం

మూడు పాడిగేదెలకు తీవ్ర గాయాలు

శీతనపల్లి (కైకలూరు): విద్యుదాఘాతంతో మండలంలోని శీతనపల్లి గ్రామంలో సోమవారం మూడు తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. సుమారు రూ.10 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. బొర్రా పేర్రాజు, బొర్రా నాగమల్లేశ్వరీ, గోకనబోయిన చక్రవర్తి కుటుంబాలు పక్కపక్కనే తాటాకు ఇళ్లలో నివసిస్తున్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు పేర్రాజు ఆయన భార్య సామ్రాజ్యంతో నివసిస్తున్నారు. భర్త మరణించడంతో నాగమల్లేశ్వరి ఒంటరిగా ఉంటుంది. చక్రవర్తి పొలం పనులు చేస్తుండగా, భార్య మంగమ్మ పాఠశాలలో ఆయాగా పనిచేస్తుంది.

విద్యుత్‌ షార్టు సర్కూట్‌ వల్ల ముందుగా చక్రవర్తి ఇంట్లో మంటలు రేగాయి. వృద్ధుడైన పేర్రాజును అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు. అదే విధంగా నాగమల్లేశ్వరి మంటలు చూసి బయటకు పరుగులు తీసింది. చక్రవర్తి గొడ్లసావిడ వద్ద రెండు పాడి గేదెలు, ఒక పడ్డా అగ్నికీలకల్లో చిక్కుకున్నాయి. గ్రామస్తులు వాటి కట్లు విప్పారు. అప్పటికే వాటి శరీరం భారీగా కాలింది. సమీపంలోని కొబ్బరిచెట్లు ఆకులు మండలకు కాలిపోయాయి. రెండు గ్యాస్‌ సిలిండర్లు భారీ శబ్ధంతో పేలాయి. అగ్నిమాపక సిబ్బంది ఒక సిలిండరును పేలకుండా అదుపు చేశారు.

అగ్నికీలలు పెరగడంతో బొర్రా మురళీ, నీలపాల రామచంద్రరావు ఇళ్ల అద్దాలు పగిలాయి. కైకలూరు అగ్నిమాపక అధికారి జీవీ రామారావు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలు అదుపు చేశారు. సర్పంచ్‌ కట్టా శ్రీనివాసరావు, వార్డు సభ్యులు పరమేశ్వరరావు, గ్రామ పెద్దలు బాధితులను పరామర్శించారు. గ్రామ ప్రత్యేకాధికారి అరుణ్‌కుమార్‌ వివరాలు సేకరించారు. పంచాయతీ, రెవెన్యూ అధికారులు బాధితుల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం బాధితులను అదుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు